TS Constable Jobs: 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు.. ఇంద్రవెల్లి సభలో సీఎం
X
తెలంగాణలో ఉద్యోగార్థులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రానున్న 15 రోజుల్లో 15 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇంద్రవెల్లి సభలో సీఎం మాట్లాడుతూ.. పోలీసు ఉద్యోగాలు ఆశించే అభ్యర్థులకు సంబంధించి నియామక ప్రక్రియ త్వరలోనే చేపడతామన్నారు. త్వరలోనే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందించే గ్యారంటీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే ఇంటింటికి రూ.500లకే సిలిండర్ ఇచ్చే కార్యక్రమాన్ని ప్రియాంక గాంధీ సమక్షంలో ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 2లక్షల పోస్టులు భర్తీ చేసే బాధ్యత తమదన్నారు. ఇప్పటికే రూ.7వేల ఉద్యోగాలు ఇచ్చాం. తెలంగాణ ఎవరి చేతుల్లో భద్రంగా ఉంటుందో, ఎవరు అభివృద్ధి పథంలో నడిపిస్తారో ప్రజలు ఆలోచించాలన్నారు. లోక్ సభ ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ.. ఈ దేశంలో ఉన్నది రెండే కూటములని.. ఒకటి ఎన్డీఏ, రెండోది ఇండియా కూటమి అని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని కావాలంటే ఆదిలాబాద్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరాలన్నారు.
బీఆర్ఎస్ నేతలు కొందరు నిత్యం తమ ప్రభుత్వాన్ని పడగొడతామని, కూలగొడతామని అవాకులు, చవాకులు పేలుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. ఈ తెలంగాణ రాష్ట్రం ఎవరి చేతుల్లో భద్రంగా ఉంటుందో ఇప్పటికైనా ఆలోచించమని రేవంత్ రెడ్డి కోరారు. అరవై రోజులు కాకముందే ఆరు గ్యారంటీల అమలు చేయలేదని సన్నాసులు గోల చేస్తున్నారన్నారు. 3 నెలలకో , 6 నెలలకో కేసీఆర్ సీఎం అవుతాడని ఎవడైనా అంటే పళ్లు రాలగొడతామన్నారు. అన్ని వర్గాలను నట్టేట ముంచిన కేసీఆర్‌కు ముఖ్యమంత్రి పదవి కాదు కదా.. మంత్రి పదవి కూడా రాదన్నారు. నిత్యానంద స్వామి లాగా కేసీఆర్ కూడా ఎక్కడైనా వెళ్లి, ఏదైనా దీవిని కొనుక్కుని రాజుగా ప్రకటించుకోవాలని రేవంత్ ఎద్దేవా చేశారు. పార్లమెంటు స్థానాలు బీఆర్ఎస్ కు ఎన్ని ఇచ్చినా మోదీకి అమ్ముకున్నారని, మళ్లీ ఇస్తే అదే జరుగుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. మోదీ దగ్గర గులాంగిరీ చేయడానికే రేవంత్ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ప్రజల వద్దకు వస్తున్నారని రేవంత్ అన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు.