TSPSC కేసు: రూ.75 లక్షలకు AEE పేపర్ కొనుగోలు చేసిన మాజీ MPTC కూతురు
X
టీఎస్పీఎస్‌సీ కేసులో తీగ లాగి కొద్దీ ఎక్కడెక్కడి డొంకలు కదులుతున్నాయి. తాజాగా ఈ కేసులో A-50 ముద్దాయిగా ఉన్న విద్యుత్ శాఖ డీఈ రమేష్ లీలలు చూసి అధికారులే విస్తుపోతున్నారు. AEE, DAO ఎగ్జామ్స్‌లో ఇన్విజిలేటర్స్ సాయంతో హైటెక్ మాస్ కాపీయింగ్‌కి తెర లేపాడు.. దీంతో అతగాడి ద్వారా లబ్ధి పొందిన అభ్యర్థుల జాబితాను సిట్ అధికారులు తయారు చేస్తున్నారు. మాస్ కాపీయింగ్‌కి పాల్పడ్డ పలువురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. సిట్ విచారణలో డీఈ రమేష్ విస్తుపోయే నిజాలను బయటపెట్టాడు.
డీఈ రమేష్ 80 మందికి ఏఈ పేపర్ అమ్మినట్లు గుర్తించారు. ఒక్కొక్కరి నుంచి రూ.30 లక్షలకు బేరం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. పూల రమేష్ కి పేపర్ ను ఇచ్చింది కీలక నిందితుడు ప్రవీణ్. తాను పనిచేసిన ఏరియాలోని అభ్యర్థులకు AEE పేపర్ అమ్మాడు డి ఈ రమేష్. పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలోని చాలామంది అభ్యర్థులకు ఏఈ పేపర్ అమ్మకానికి పెట్టాడు. మాస్ కాపీయింగ్ కి అవసరమైన మైక్రో రిసీవర్స్, మైక్రో ఇయర్ బగ్స్ ఆన్‌లైన్‌లో రూ.50 వేలకి కొన్నారు. మాస్ కాపీయింగ్ కోసం సేకరించిన డివైజెస్‌తో పలుసార్లు డెమో నిర్వహించారు. అంతా ఓకే అనుకున్నాక.. రమేష్ అతని బంధువు పూల సురేష్.. అభ్యర్ధుల కోసం సెర్చ్ చేశారు. సిటీలోని కోచింగ్ సెంటర్స్‌లో కోచింగ్ తీసుకుంటున్న కేండిడేట్స్‌తో కాంటాక్ట్ అయ్యారు. ఇందులో AEE, DAO పరీక్షలు రాస్తున్న అభ్యర్ధులను గుర్తించారు. వాళ్లతో మాట్లాడి డీల్ సెట్ చేసుకుని కోట్ల రూపాయలు దండుకున్నారు అని సిట్ అధికారులు గుర్తించారు.
స్థానిక ప్రజాప్రతినిధుల పిల్లలకు AEE పేపర్ అమ్మినట్లు అధికారులు గుర్తించారు. డీఈ రమేష్ .. ఓ మాజీ ఎంపీటీసీ కూతురితో AEE పరీక్ష రాయించేందుకు రూ.75లక్షలకు బేరం కుదుర్చుకున్నట్లు తేలింది. ఒప్పందంలో భాగంగా మాజీ ఎంపీటీసీ కూతురికి ఎలక్ట్రానిక్ డివైజ్ ఇచ్చాడని, దాని ద్వారా ఆమెకు సమాధానాలు చెప్పినట్లు సమాచారం. దీంతో డీఈ రమేష్‌ను ఆరు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. రమేష్ విచారణతో మరికొందరు అరెస్టు అయ్యే అవకాశం ఉంది.