అక్టోబర్లో గ్రూప్ - 3 ఎగ్జామ్.. త్వరలో పరీక్ష తేదీ ప్రకటన..!
X
గ్రూప్-3 పరీక్షను అక్టోబర్‌లో నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. పరీక్ష నిర్వాహణకు సంబంధించి కమిషన్ కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. గ్రూప్ 3 పరీక్షకు సంబంధించి ఇప్పటికే రెండు, మూడుసార్లు చర్చించిన అధికారులు ఎన్నికలకు ముందే ఎగ్జామ్ నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. వారం, పది రోజుల్లో పరీక్ష తేదీలను కమిషన్ ప్రకటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.
అక్టోబర్ నెలలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఐబీపీఎస్‌తో పాటు ఇతర పరీక్షలు ఉన్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకొని గ్రూప్-3 పరీక్ష తేదీలను ఖరారు చేయనున్నట్లు టీఎస్‌పీఎస్సీ అధికారులు చెప్పారు. అక్టోబర్ రెండు లేదా మూడో వారంలో పరీక్ష నిర్వహించాలని కమిషన్ భావిస్తున్నామని అన్నారు. తెలంగాణలో ఎన్నికలలోపే పరీక్షలన్నీ పూర్తి చేయాలనే సంకల్పంతో ప్లాన్ సిద్ధం చేశామని వెల్లడించారు.
రాష్ట్రంలో 105 విభాగాల్లో గ్రూప్-3 కేటగిరీలో 1,363 ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. వీటికి 5,36,477 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కో ఉద్యోగానికి సగటున 394 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.