Hyderabad: పాతబస్తీలో ఆర్టీసీ బస్సు బీభత్సం.. నలుగురికి గాయాలు..
X
హైదరాబాద్ పాతబస్తీలో ఓ బస్సు బీభత్సం సృష్టించింది. జూపార్కు నుంచి పురానాపూల్ వైపు వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీ కొట్టింది. బహదూర్‌పురా క్రాస్ రోడ్డు సిగ్నల్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. వారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సును రాజేంద్రనగర్ డిపోకి చెందినదిగా గుర్తించారు. విషయం తెలుసుకుని ఘటన స్థలానికి చేరుకున్న బహదూర్‌పురా సీఐ పరిస్థితిని సమీక్షించారు. బస్సు బ్రేకులు ఫెయిల్ కావడం వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్థారించారు. బస్సు వేగంగా వచ్చి ఉంటే భారీ ప్రాణ నష్టం జరిగి ఉండేదని స్థానికులు అంటున్నారు. ఘటనకు సంబంధించి కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.