దసరా స్పెషల్ బస్సులతో టీఎస్ఆర్టీకి భారీ ఆదాయం
X
దసరా పండుగ తెలంగాణ ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. సొంతూళ్లకు వెళ్లే వారితో పాటు తిరిగొచ్చే వారి కోసం ఏర్పాటు చేసిన ఆర్టీసీ ప్రత్యేక బస్సులతో భారీగా ఆదాయం సమకూరింది. దసరా రద్దీ కారణంగా టీఎస్ఆర్టీసీకి దాదాపు రూ.25 కోట్ల అదనపు ఆదాయం సమకూరినట్లు అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా సర్వీసులు నడపడం వల్లే ఆదాయం పెరిగిందని అంటున్నారు.
దసరా సందర్భంగా టీఎస్ఆర్టీసీ రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఏపీ, కర్నాటకు 5,500 స్పెషల్ బస్సులు నడిపింది. గతేడాదితో పోలిస్తే ఈసారి 1300ల బస్సులు ఎక్కువగా ఏర్పాటు చేసింది. ఎంజీబీఎస్, జేబీఎస్, దిల్సుక్ నగర్, ఎల్బీ నగర్, లింగంపల్లి, కేపీహెచ్బీ ,అమీర్పేట్,ఉప్పల్ క్రాస్ రోడ్ నుంచి బస్సులు నడిపింది. సాధారణ ఛార్జీలతో పాటు డైనమిక్ ఛార్జీలతో టికెట్లు అందుబాటులోకి తెచ్చింది.
టీఎస్ఆర్టీసీకి నిత్యం దాదాపు రూ.12 కోట్ల నుంచి రూ.13 కోట్ల ఆదాయం సమకూరేది. పండుగ సందర్బంగా టీఎస్ ఆర్టీసీ అక్టోబర్ 13 నుంచి 24 వరకు 11 రోజుల పాటు ప్రత్యేక బస్సులు నడిపింది. ఫలితంగా ప్రతిరోజూ అదనంగా దాదాపు రూ.2 నుంచి రూ.3 కోట్ల వరకు వచ్చినట్లు సమాచారం. ఈ లెక్కన గత 11 రోజుల్లో రూ.25 కోట్లకుపైగా అదనపు ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 10 రీజియన్లు ఉన్నాయి. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్, గ్రేటర్ హైదరాబాద్ రెండు రీజియన్లు ఉన్నాయి. ఒక్కో రీజియన్‌కు సగటున రూ.2 కోట్ల నుంచి రూ.2.50 కోట్ల వరకు అదనపు ఆదాయం వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.