VC Sajjanar: ఆర్టీసీ డ్రైవర్‌పై ఆటోడ్రైవర్ల దాడి.. సజ్జనార్ సీరియస్
X
మహాలక్ష్మి పథకం కింద తెలంగాణ ప్రభుత్వం... రాష్ట్ర మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సదుపాయం కల్పించింది. దీంతో బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. కొందరు ఫుట్‌బోర్డ్‌పై వేలాడుతూ ప్రయాణిస్తున్నారు.మరోవైపు ఈ పథకంవల్ల తమ జీవితాలు దుర్భరంగా మారుతున్నాయని ఆటో డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీసీ సిబ్బందిని శత్రువులుగా చూస్తూ వారిపై దాడి చేస్తున్నారు. అయితే కొత్తగూడెంలో బస్సు డ్రైవర్ పై ఆటో డ్రైవర్లు దాడి చేయడం, భద్రాచలంలో ఓ మహిళా కండక్టర్ ను ప్రయాణికులు దూషించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనిపై TSRTC ఎండీ సజ్జనార్ సీరియస్ అయ్యారు. ఈ రెండు సంఘటనలపై ట్విట్టర్ వేదికగా స్పందించారు.
"టీఎస్‌ఆర్టీకి సిబ్బంది వెన్నుముక. వారు అనునిత్యం నిబద్దతతో విధులు నిర్వర్తిస్తూ ప్రతి రోజు లక్షలాది ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చుతున్నారు. సిబ్బంది కృషి వల్లనే సంస్థ మనగలుగుతుంది. మహాలక్ష్మి స్కీమ్ అమలులోనూ కీలకపాత్ర పోషిస్తున్నారు. సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లైనా సిబ్బందిని కొందరు దూషించడం, దాడులు చేయడం సరికాదు. ఇలాంటి ఘటనలకు టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం సహించదు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే మా అధికారులు ఈ ఘటనలపై పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆర్టీసీ సిబ్బందికి ప్రయాణికులు సహకరించాలి. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సహకరించాలని కోరుతున్నాం" అని అన్నారు.