ఆడవాళ్లతో నిండిపోతున్న ఆర్టీసీ బస్సులు.. మగవారికి కోసం నయా ప్లాన్..
X
తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ స్కీం విజయవంతంగా కొనసాగుతోంది. ఫ్రీ జర్నీతో ఎక్స్ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో మహిళల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో మగవారికి సీట్లు దొరకడం కష్టంగా మారింది. పలువురు పురుషులు ప్రభుత్వంపై విమర్శలకు దిగుతున్నారు. ఈ స్కీం అటు ఆర్టీసీపైనా ఒత్తిడిని పెంచుతోంది. ఈ క్రమంలో టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. బస్సుల్లో మగవారికి రిజర్వ్డ్ సీట్లు కేటాయించే అంశాన్ని పరిశీలిస్తోంది.
ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణంతో సీట్లు దొరక్క మగవారికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అలాగని ఆడవాళ్లని బస్సు ఎక్కొద్దని చెప్పలేరు. దీంతో ఒకప్పుడు మహిళలకు కేటాయించినట్లుగానే ఇప్పుడు పురుషులకు బస్సుల్లో రిజర్వుడ్ సీట్లు కేటాయించే అంశాన్నీ ఆర్టీసీ పరిశీలిస్తోంది. ప్రతీ బస్సులోనూ మొత్తం 55 సీట్లలో 20 సీట్లు రిజర్వ్ చేస్తే ఎలా ఉంటుందనే దానిపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. ఈ మేరకు డిపో మేనేజర్ల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు.
ఒకవేళ మగవాళ్లకు రిజర్వ్ డ్ సీట్లు కేటాయిస్తే.. ఆడవాళ్ల నుంచి వ్యతిరేకత వస్తుందా అనే కోణంలోనూ అధికారులు చర్చలు జరుపుతున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇప్పటివరకు ఆడవారికి తప్ప.. మగవారికి ఎక్కడా రిజర్వ్ డ్ సీట్లు కేటాయించలేదు. దీంతో ఈ అంశంపై ఆర్టీసీ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. అందరి అభిప్రాయాలు తెలుసకున్న తర్వాత పురుషులకు రిజర్వుడు సీట్లపై నిర్ణయం తీసుకోవాలనే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది.