Home > తెలంగాణ > 'పురుషులకు మాత్రమే'.. స్పెషల్ బస్సులపై TSRTC ఫోకస్

'పురుషులకు మాత్రమే'.. స్పెషల్ బస్సులపై TSRTC ఫోకస్

పురుషులకు మాత్రమే.. స్పెషల్ బస్సులపై TSRTC ఫోకస్
X

రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చాక ఆర్టీసీ బస్సుల్లో (TSRTC) రద్దీ గణనీయంగా పెరిగింది. కొన్ని బస్సుల్లో అయితే వెనుక వరుస సీట్ల వరకు వారే కనిపిస్తున్నారు. ఈ కారణంగా పురుషులు నిలబడటానికి కూడా చోటు లేకుండా పోయింది. దూర ప్రాంతాలకు కూడా గంటల తరబడి నిలబడే ప్రయాణం చేస్తున్నారు. కొన్నిచోట్ల ఆ రద్దీని భరించలేక మధ్యలోనే దిగి వెళ్లిపోతున్నట్లు ఇటీవల నిర్వహించిన ఆన్‌లైన్‌ మీటింగ్‌లో కండక్టర్లు.. ఆర్టీసీ ఎండీ దృష్టికి తీసుకువచ్చారు. ఈ నేపథ్యంలో అవసరమైన రూట్లు, సమయాల్లో పురుషుల కోసం ప్రత్యేక బస్సులు నడిపే విషయంపై ఆర్టీసీ యోచిస్తోంది. వృద్ధుల(పురుషులు)కు ప్రత్యేకంగా సీట్ల కేటాయింపుపైనా కసరత్తు జరుగుతోంది. మరోవైపు విద్యార్థులకు సైతం కొన్ని మార్గాల్లో సర్వీసులు నడిపే విషయాన్ని ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. సీనియర్‌ సిటిజన్లకు ప్రత్యేక సీట్లలో తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిసింది.

ఉచిత పథకంతో ఆర్టీసీ బస్సుల ఆక్యుపెన్సీ విపరీతంగా పెరుగుతున్నది. గతంలో 69 శాతం ఉన్న ఈ రేషియో ఇప్పుడు 89 శాతానికి పెరిగింది. గతంలో మహిళా ప్రయాణికులు 12 నుంచి 14 లక్షల మంది ఉండగా.. ఇప్పుడు 29 లక్షలు చేరడం గమనార్హం. ఉన్న బస్సులతోనే అంత రద్దీని తట్టుకోవడం ఆర్టీసీకి సవాలుగా మారుతోంది. పట్టణాల నుంచి గ్రామాలకు వెళ్లే ఆఖరి బస్సుల్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. ఈ నేపథ్యంలో పరిస్థితుల్ని డ్రైవర్‌, కండక్టర్లు దాదాపు 20 మందికిపైగా ఆర్టీసీ ఎండీకి వివరించారు. సమస్య పరిష్కారానికి సూచనలూ ఇచ్చారు. దీంతో స్పెషల్ బస్సులు నడపాలనే ఆలోచనకు వచ్చారు ఆర్టీసీ ఎండీ. పురుషులకు, విద్యార్థులకు ప్రత్యేక బస్సులు సాధ్యం కాని పక్షంలో మహిళలకే సెపరేట్ బస్సు నడపాలనే ఆలోచనలో ఆర్టీసీ ఉన్నతాధికారులు చేస్తున్నారు.

Updated : 27 Dec 2023 2:40 AM GMT
Tags:    
Next Story
Share it
Top