TSRTC: ఒక్కరోజే దాదాపు అరకొటి మంది ప్రయాణం.. రూ.కోట్లల్లో ఆదాయం
X
సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లిన జనమంతా.. తిరిగి నగరానికి చేరుకుంటున్నారు. సెలవులు ముగియడంతో ఇప్పటికే విద్యార్థులు, ఉద్యోగులు భారీ సంఖ్యలో హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. ఇంకొంత మంది ఉద్యోగరీత్యా పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయారు. వీరంతా సొంతూళ్ల నుంచి వచ్చేందుకు టీఎస్ ఆర్టీసీ బస్సులనే వినియోగించుకున్నారు. ఈ క్రమంలో ఈ నెల 17 న (బుధవారం) టీఎస్ఆర్టీసీకి రికార్డుస్థాయిలో ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) నమోదైంది. టికెట్ల రూపంలో రూ.22.45 కోట్ల ఆదాయం వచ్చింది. స్వస్థలాలకు వెళ్లినవాళ్లంతా.. తిరుగు ప్రయాణం అవడంతో బస్టాండ్లు, బస్సులు కిటకిటలాడాయి. ఫలితంగా ఓఆర్ ఏకంగా 101.62 శాతంగా నమోదైంది. 17వ తేదీన ఆర్టీసీ బస్సులు 33.99 లక్షల కిలోమీటర్లు తిరిగాయి. 48.94 లక్షల మంది ప్రయాణించారు.
ఇక ఈ నెల 11న 28 లక్షల మంది, 12న 28 లక్షల మంది, ఈ నెల 13న 31 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. పండుగ సమయంలో మహిళల రాకపోకలు గణనీయంగా పెరుగుతాయని ఆర్టీసీ ముందుగానే అంచనా వేసి 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. అయితే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ నెల 11, 12, 13 తేదీల్లో 4,400 ప్రత్యేక బస్సులు నడిపారు. ఇప్పటి వరకు మొత్తం 6,261 ప్రత్యేక బస్సులను నడిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు.