TSRTC బస్సుల్లో టికెట్ కొనుగోలుకు క్యూఆర్ కోడ్!
X
ఎప్పటికప్పుడు కొత్త కొత్త పథకాలతో ప్రయాణికులకు చేరువవుతున్న టీఎస్‌ఆర్టీసీ మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. బస్సుల్లో కండక్టర్లు, ప్రయాణికులు తరచుగా ఎదుర్కొనే చిల్లర(క్యాష్) కష్టాలకు చెక్ పెట్టే దిశగా క్యూఆర్ కోడ్ స్కాన్ సిస్టంను ప్రారంభించనుంది. దీంతో కండక్టర్‌కు డబ్బు చెల్లించకుండా బస్సులోని ప్రయాణికులు క్యూఆర్ కోడ్ ద్వారా నేరుగా చెల్లించి టికెట్ కొనుగోలు చేసుకోవచ్చు. ఇప్పటికే ఆర్టీసీ సాంకేతిక విభాగం అధికారులు ఈ అంశంపై కసరత్తు దాదాపుగా పూర్తి చేశారు. గత ఏడాది చివరిలోనే నగదు రహిత టికెట్ కొనుగోలు పద్దతిని ప్రవేశపెట్టాలని ఆర్టీసీ అధికారులు భావించారు. అయితే, కొన్ని సాంకేతిక కారణాల వల్ల అంతరాయాలు ఏర్పడ్డాయి.
అయితే ప్రయాణికులు టికెట్ కొనుగోలు కోసం క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లించిన డబ్బులు.. ఏదైనా కారణం వల్ల జమకాకపోతే ఆ డబ్బులకు ఎవరు బాధ్యత వహించాలి, క్యూఆర్ కోడ్ ద్వారా జమ అయిన నగదు ఎవరి ఖాతాలో జమ చేయబడతాయి? వంటి ప్రశ్నలు తలెత్తాయి. దీంతో ఈ సమస్యలు అన్నింటికీ పరిష్కారంగా కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. అలా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ను ప్రయోగాత్మకంగా సిటీ బస్సుల్లో అమలు చేసేందుకు ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇక్కడ ఈ విధానం విజయవంతమైతే.. మరికొన్ని రోజుల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ నగదు రహిత టికెట్‌ను అందుబాటులోకి తేనున్నది.