తప్పుడు ప్రచారాలు చేయొద్దు.. పార్టీ మార్పు వార్తలపై తుల ఉమ ఫైర్
X
బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారంటూ వస్తున్న వార్తలపై బీజేపీ నేత తుల ఉమ స్పందించారు. ఇవన్నీ తప్పుడు ప్రచారాలని కొట్టిపారేశారు. మీడియాలో వచ్చిన కథనాలను ఖండించిన ఆమె.. ప్రగతి భవన్ కు వెళ్తున్నట్లు ఎందుకు ప్రచారం చేస్తున్నారో అర్థంకావడంలేదని అన్నారు. వేములవాడలో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడిన తుల ఉమ తాను ఏ పార్టీలోకి వెళ్లాలన్నదానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ లో చేరాలా లేక బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లాలా అనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఉమ చెప్పారు. పార్టీ మార్పు అంశం తన ఒక్క నిర్ణయం కాదన్నారు. తనను నమ్ముకున్న అనుచరులు, అభిమానుల సలహాలు సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. కొంతమంది కావాలనే తనను బద్నాం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక పార్టీకి రాజీనామా చేసినప్పుడు తమ పార్టీలో చేరాలని రాజకీయ నాయకులు అడగడం సహజమని ఉమ అన్నారు. బీజేపీలో ఉండి తాను ఇప్పటికే చాలా నష్టపోయానని, మళ్లీ ఆ పరిస్థితి రాకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఇప్పుడు తీసుకునే నిర్ణయం అందరికీ ఉపయోగపడేలా ఉంటుందని, భవిష్యత్తులో తాను రాజకీయాల్లో కీలకంగా ఉండేలా ఉంటుందని తుల ఉమ తేల్చి చెప్పారు.