నిర్లక్ష్యంగా బైక్ నడిపిన తండ్రి.. గాల్లో కలిసిన రెండు ప్రాణాలు.. (షాకింగ్ వీడియో)
X
ఓ తండ్రి నిర్వాకం ఇద్దరు చిన్నారుల్ని బలితీసుకుంది. నిర్లక్ష్యంగా బైక్ నడిపి కడుపుకోతకు కారణమైంది. ములుగు జిల్లాలో జరిగిన ఈ ఘటన అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. ప్రమాదానికి సంబంధించిన వీడియోను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ములుగు జిల్లా మంగపేటలోని తెలంగాణ సెంటర్ వద్ద శుక్రవారం బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఓ వ్యక్తి బైక్ పై తన భార్యతో పాటు ఇద్దరు కొడుకులను తీసుకుని వెళ్తున్నాడు. అయితే చౌరస్తా వద్ద అటు ఇటూ చూడకుండా స్పీడ్గా రోడ్డు దాటే ప్రయత్నం చేశాడు. దీంతో అప్పటికే అటువైపు వేగంగా వస్తున్న ఓ బస్సు బైక్ను ఢీకొట్టడంతో చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ హృదయవిదారక దృశ్యం అక్కడే ఉన్న ఓ సిసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది.
ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భార్యాభర్తలకు స్థానిక హాస్పిటల్ లో ట్రీట్మెంట్ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే తండ్రి నిర్లక్ష్యం కారణంగానే చిన్నారులు ప్రాణాలు కోల్పోయారని స్థానికులు అంటున్నారు. ఈ వీడియోను షేర్ చేసిన సజ్జనార్.. గ్రామీణ ప్రాంతాల్లో ట్రాఫిక్ రూల్స్పై సరైన అవగాహన లేకపోవడం వల్ల ఈ తరహా ప్రమాదాలకు గురవుతున్నారని అభిప్రాయపడ్డారు. వాహనాలు నడిపేటప్పుడు నిత్యం జాగ్రత్తగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అజాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సజ్జనార్ హితవు పలికారు.
ఈ బైకర్ నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఖరీదు రెండు నిండు ప్రాణాలు. ఇద్దరు కుమారులు, భార్యను ఎక్కించుకుని అజాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ బైక్ ను #TSRTC బస్సుకు ఢీకొట్టాడు. ములుగు జిల్లా మంగపేటలోని తెలంగాణ సెంటర్ వద్ద శుక్రవారం ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు దుర్మరణం… pic.twitter.com/5zv1y04a6X
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) June 17, 2023