Ramanthapur : రామంతాపూర్లో దారుణం.. టీచర్ కొట్టడంతో చిన్నారి మృతి
X
రామంతాపూర్లో దారుణం జరిగింది. ఓ టీచర్ చేసిన పనికి నిండుప్రాణం బలైంది. హోం వర్క్ చేయలేదన్న కారణంతో టీచర్ యూకేజీ విద్యార్థిని కొట్టడంతో బాలుడు స్పృహతప్పి పడిపోయాడు. హాస్పిటల్కు తరలించగా అప్పటికే ప్రాణాలు వదిలాడు. విగతజీవిగా మారిన కన్నబిడ్డను చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
రామంతాపూర్లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో హేమంత్ అనే బాలుడు యూకేజీ చదువుతున్నాడు. సోమవారం స్కూల్ కు వెళ్లిన ఆ చిన్నారి హోం వర్క్ చేయలేదు. దీంతో టీచర్ పలకతో ఆ బాలుడిని కొట్టింది. ఆ దెబ్బకు హేమంత్ స్పృహతప్పి పడిపోయాడు. దీంతో స్కూల్ సిబ్బంది వెంటనే అతన్ని హాస్పిటల్ కు తరలించారు. అయితే ట్రీట్మెంట్ తీసుకుంటూ హేమంత్ ప్రాణాలు వదిలాడు.
హేమంత్ మృతి విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు వెంటనే హాస్పిటల్కు చేరుకున్నారు. విగతజీవిగా మారిన బిడ్డను చూసి కన్నీరుమున్నీరయ్యారు. వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. టీచర్ కారణంగా బిడ్డను కోల్పోయిన తమకు న్యాయం చేయాలంటూ హేమంత్ తల్లిదండ్రులు, బంధువులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు.