రేపు తెలంగాణకు అమిత్ షా.. లోక్సభ ఎన్నికలపై దిశానిర్దేశం..
X
అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం మూటగట్టుకున్న బీజేపీ తప్పులు సరిదిద్దుకునే పనిలో పడింది. పనిలో పనిగా లోక్ సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకోవడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై రాష్ట్ర నేతలతో చర్చించనున్నారు. కేడర్‌కు దిశానిర్దేశం చేయనున్నారు.
రాష్ట్ర పర్యటనలో భాగంగా అమిత్ షా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో భేటీ కానున్నారు. గెలిచిన ఎమ్మెల్యేలను ప్రత్యేకంగా కలిసి మాట్లాడుతారు. మరోవైపు బీజేపీ శాసన సభాపక్ష నేత ఎవరన్న దానిపైనా గురువారం స్పష్టతరానుంది. అమిత్ షా సమక్షంలో బీజేఎల్పీ నేతను ఎన్నుకోనున్నారు.
మరోవైపు మధ్యాహ్నం 3గంటలకు పాతబస్తీలోని భాగ్యలక్ష్మి గుడి అమిత్ షా వెళ్లనున్నారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం కొంగర కలాన్ లో నిర్వహించే బీజేపీ విస్తృతస్థాయి సమావేశానికి హాజరవుతారని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి.