Home > తెలంగాణ > బీజేపీని గెలిపిస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం : యోగి

బీజేపీని గెలిపిస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం : యోగి

బీజేపీని గెలిపిస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం : యోగి
X

తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ అన్నారు. దానికి నిదర్శనమే ముస్లిం రిజర్వేషన్లు అని.. బీజేపీని గెలిపిస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి వెనకబడిన వర్గాలకు అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగజ్నగర్, వేములవాడ నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నీళ్లు, నిధులు, నియామకాల డిమాండ్‌తో రాష్ట్రం ఏర్పడితే.. కేసీఆర్ ప్రభుత్వం ఏ డిమాండ్ను నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. యూపీలోనూ 2017కు ముందు ఇలాంటి పాలనే ఉందని.. కానీ తాము అధికారంలోకి వచ్చాక పరిస్థితిలో మార్పు వచ్చిందన్నారు.

తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ - కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని యోగి ఆరోపించారు. బీఆర్ఎస్ - కాంగ్రెస్‌ అజెండా ఒక్కటేనని.. వ్యక్తిగత అభివృద్ధి కోసమే వాళ్లు పని చేస్తారని విమర్శించారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉంటే కరోనా వ్యాక్సిన్‌, పేదలకు ఉచితంగా కాంగ్రెస్‌ బియ్యం ఇచ్చేదా..? అని ప్రశ్నించారు. ఎంఐఎం పార్టీకి భయపడి సీఎం కేసీఆర్‌ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించలేదని.. బీజేపీ అధికారంలోకి రాగానే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు.

నిరుద్యోగ సమస్యలను కేసీఆర్ సర్కార్ గాలికొదిలేసిందని యోగి ఆరోపించారు. పేపర్ లీకేజీలతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. ప్రధాని మోదీ 10లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని.. ఇప్పటికే 6లక్షల ఉద్యోగాలు ఇచ్చారని గుర్తుచేశారు. మిగితావి త్వరలోనే భర్తీ చేస్తారన్నారు. బీజేపీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజల కష్టాలు, ఆకాంక్షలు నెరవేరాలంటే బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Updated : 25 Nov 2023 4:25 PM IST
Tags:    
Next Story
Share it
Top