Home > తెలంగాణ > బీఆర్ఎస్ పార్టీపై ఉప్పల్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ పార్టీపై ఉప్పల్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

బీఆర్ఎస్ పార్టీపై ఉప్పల్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X

బీఆర్ఎస్లో అసంతృప్తుల సెగ ఇంకా చల్లారడం లేదు. టికెట్ రాని నేతలంతా పార్టీపై గుర్రుగా ఉన్నారు. రేఖానాయక్ వంటి నేతలు ఇప్పటికే వేరే పార్టీలోకి వెళ్తుండగా.. మరికొందరు పార్టీ వెంటే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. టికెట్ ఇచ్చిన బండారు లక్ష్మారెడ్డి పార్టీ కోసం ఏం చేశారని ప్రశ్నించారు.

ఇవాళ జరిగిన కార్యకర్తల సమావేశంలో టికెట్ రాకపోవడంపై బేతి ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీ వెంటే ఉన్నానని.. ఎన్నో ఇబ్బందులను తట్టుకుని ఉప్పల్ లో పార్టీని నిలబెట్టినట్లు చెప్పారు. బండారు లక్ష్మారెడ్డి పార్టీ కోసం ఏం చేశాడని.. ఏ రోజైనా జెండా మోసిండా అని నిలదీశారు. అలాంటి వ్యక్తికి టికెట్ ఎలా కేటాయిస్తారని అధిష్టానాన్ని అడిగారు. గ్రేటర్‌లో తాను ఒక్కడినే ఉద్యమకారుడినని వ్యాఖ్యానించారు.

బండారు లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నేతల ఫొటోలు పెట్టుకుని తిరుగుతున్నాడని బేతి ఆరోపించారు. ఉప్పల్ టికెట్ వేరే వ్యక్తికి ఇచ్చే ముందు తనతో చర్చించలేదని చెప్పారు. మరణశిక్ష పడ్డ వ్యక్తిని కూడా ఏం కావాలని అడుగుతారని.. కానీ తనని అడగకుండానే టికెట్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏం తప్పు చేశానని.. బలి చేశారని ఎమోషనల్ అయ్యారు. 10 రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేశారు.

Updated : 29 Aug 2023 2:07 PM IST
Tags:    
Next Story
Share it
Top