Uttam Kumar : బీఆర్ఎస్ హయాంలో నీళ్ల దోపిడి నాలుగింతలు పెరిగింది
X
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇరిగేషన్ శాఖపై శ్వేతపత్రం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగిందని గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పాడి పదేళ్లైనా అమరుల త్యాగాలు, ఆశయాలు ఇంకా నెరవేరలేదని అన్నారు. ఈ పదేళ్లలో నీళ్ల దోపిడి నాలుగింతలు పెరిగిందని ఆరోపించారు. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా సాధించడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఉత్తమ్ విమర్శించారు. కృష్ణా జలాల్లో 299 టీఎంపీలకే అంగీకరించి రాష్ట్రానికి అన్యాయం చేశారని అన్నారు. దీనివల్ల ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు తీరని అన్యాయం జరిగిందని ఉత్తమ్ ఆరోపించారు.
మేడిగడ్డ పిల్లర్లకు పగుళ్లు ఏర్పాడ్డాయని.. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కూడా దారుణంగా దెబ్బతిన్నారని అన్నారు. అన్నారం బ్యారేజీ నుంచి లీకులు జరుగుతున్నాయని, రానున్న రోజుల్లో కుంగిపోయే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చారు. వందేళ్లవుతున్నా నిజాం సాగర్ ప్రాజెక్ట్ ఇంకా పటిష్టంగా ఉంది. నాగార్జున సాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు చెక్కుచెదరకుండా, రాష్ట్రానికి వరప్రదాయినిగా ఉన్నాయి తెలిపారు. కేఆర్ఎమ్బీకి ప్రాజెక్టులు అప్పగించేందుకు బీఆర్ఎస్ అంగీకరించిందని ఈ సందర్భంగా ఉత్తమ్ తెలిపారు. రానున్న రోజుల్లో కృష్ణా, గోదావరి ఆయకట్టను వీలైనంత పెంచేందుకు కృషి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ చెప్పారు.