ఎవరు తప్పు చేసినా వదిలి పెట్టం.. కాళేశ్వరం అవినీతిపై మంత్రి ఉత్తమ్
X
కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై కచ్చితంగా దర్యాప్తు జరిపిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ వారంలోనే కాళేశ్వరం నిర్మాణంపై జ్యూడీషియల్ ఎంక్వైరీ వేయనున్నట్లు ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక కాళేశ్వరం అవినీతిని ఎందుకు పట్టించుకోవడం లేదన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు మంత్రి ఉత్తమ్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్లు ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిని వెలికితీసేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని ఉత్తమ్ అన్నారు. అసలు ఆ ప్రాజెక్టుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే మద్దతు ఇచ్చిందని ఆరోపించారు. పదేండ్ల పాటు బీజేపీ, బీఆర్ఎస్ కలిసి పనిచేశాయన్న ఉత్తమ్.. కేసీఆర్ అడిగిన వెంటనే నిబంధనలు మార్చి రుణాలు ఇవ్వలేదా అని ప్రశ్నించారు. పవర్ సప్లై కార్పొరేషన్ నిబంధనలు మార్చి ఇరిగేషన్ ప్రాజెక్టుకు లోన్లు ఇచ్చారని, రూరల్ కార్పొరేషన్ నుంచి రూ.60వేల కోట్ల రుణం ఇచ్చింది మోడీ సర్కారు కాదా అని ప్రశ్నించారు. రుణాలు ఇచ్చినప్పుడు ప్రాజెక్టులు ఎందుకు చెక్ చేయాలేదని నిలదీశారు.
మేడిగడ్డపై మాట్లాడేందుకు కిషన్ రెడ్డికి కామన్ సెన్స్ ఉండాలని ఉత్తమ్ అన్నారు. బ్యారేజీ కుంగినప్పుడు అక్కడకు ఎందుకు వెళ్లలేదని, దానిపై కేసీఆర్ సర్కారును ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. ప్రాజెక్టు రీ డిజైనింగ్ కు అనుమతించిన కేంద్రం ఇప్పుడు కాంగ్రెస్ ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. కాళేశ్వరం బీఆర్ఎస్ కు ఏటీఎంలా మారిందన్న ప్రదాని మోడీ గత పదేండ్లలో కేసీఆర్ పై చర్యలు ఎందుకు తీసుకోలేదో చెప్పాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం అవినీతిపై తాను పార్లమెంటులో ఎన్నిసార్లు ప్రశ్నలు అడిగినా కేంద్రం ఎందుకు స్పందించలేదని నిలదీశారు.