Home > తెలంగాణ > ఆ 41 మంది కోసం పడిగాపులు కాస్తున్న కుటుంబ సభ్యులు

ఆ 41 మంది కోసం పడిగాపులు కాస్తున్న కుటుంబ సభ్యులు

ఆ 41 మంది కోసం పడిగాపులు కాస్తున్న కుటుంబ సభ్యులు
X

ఉత్తరాఖండ్​ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలను బయటకు తీసుకొచ్చేందుకు మరింత సమయం పట్టేటట్లు ఉంది. కార్మికులను చేరుకునే అమెరికన్‌ ఆగర్‌ యంత్రం చివరి 12 మీటర్ల గొట్టపు మార్గపు పనిలో అవాంతరాలు ఏర్పడ్డాయి. ఆగర్ యంత్రంలో మూడు సార్లు సమస్యలు తలెత్తడం వల్ల గురువారం పూర్తి కావాల్సిన పని ఆలస్యమైనట్లు అధికారులు చెబుతున్నారు. కూలీలు శుక్రవారం లేదా శనివారంలోగా బయటకు రానున్నట్లు తెలుస్తోంది. తమ వాళ్లు ఎప్పుడు బయటికొస్తారని.. కూలీల కుటుంబసభ్యులు సొరంగం బయటే వారి కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు.

డ్రిల్లింగ్ పనుల కోసం రప్పించిన అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుడు ఆర్నాల్డ్ డిక్స్ కార్మికులను సురక్షితంగా బయటకు తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాల్ని మరికాసేపట్లో ప్రారంభించనున్నారు. కార్మికుల్ని చేరుకునేందుకు వర్టికల్ డ్రిల్లింగ్‌ను సైతం చేయాలా లేదా అనేది పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అయితే దీనిపై అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామీ గురువారం రాత్రంతా టన్నెల్ సమీపంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక క్యాంప్ ఆఫీస్‌లో ఉన్నారు. సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్నారు.

రాష్ట్రంలోని ఉత్తర కాశీ జిల్లాలో సిల్క్యారా వద్ద సొరంగం కూలిన ఘటనలో 41 మంది చిక్కుకున్న సంగతి తెలిసిందే. చార్‌ధామ్‌ రోడ్‌ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న టన్నెల్‌లో కొంతభాగం ఈ నెల 12న తెల్లవారుజామున కూలిపోయింది. దీంతో 57 మీటర్ల మేర శిథిలాలు పేరుకుపోయాయి. అప్పటినుంచి సహాయక చర్యలను చేపట్టారు. ఆ 41 మంది క్షేమంగా తిరిగిరావాలని దేశమంతా కోరుకుంటోంది.


Updated : 24 Nov 2023 8:27 AM IST
Tags:    
Next Story
Share it
Top