రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నిరసనలు
X
ఉచిత కరెంట్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఇవాళ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఊరూరా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. రేవంత్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని విద్యుత్ సౌధ వద్ద బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నాలో బీఆర్‌ఎస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొని నిరసన తెలియజేశారు. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహబూబ్‌నగర్ తెలంగాణ చౌరస్తాలో నిర్వహించిన నిరసనల్లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.
మంత్రి KTR పిలుపుతో మేడ్చల్ పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ అధ్వర్యంలో TPCC చీఫ్ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు BRS నాయకులు. దిష్టి బొమ్మ దహనం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లా రెడ్డి,మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. అమెరికాకు పోయి ఎంపీ రేవంత్ డబ్బులు బిక్షం అడుక్కున్నాడు. రైతులకు 24 గంటల కరెంటు తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం మూడు గంటలు కరెంటు ఇస్తే చాలు అని అనడం రైతు వ్యతిరేకి మాటలే. దివాలా తీసిన పార్టీకి ఎంపీ రేవంత్ ను టీపీసీసీగా నియమించారు అని అన్నారు.
బోయిన్‌పల్లిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.మరోవైపు రాష్ట్ర వ్యాప్త నిరసనలలో భాగంగా ప్రతి గ్రామంలోనూ ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ దిష్టిబొమ్మలను దహనం చేస్తున్నాయి. వ్యవసాయానికి 3 గంటల కరెంట్ సరిపోతుందని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఈ ఆందోళనలు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ శ్రేణుల ఆందోళన నిర్వహించారు
BRS శ్రేణుల ధర్నాతో ఖైరతాబాద్ సర్కిల్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సెక్రటేరియట్ నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. మరో వైపు అసెంబ్లీ నుంచి లక్డీ కపూల్ వరకు, షాదాన్ కాలేజ్ నుంచి ఖైరతాబాద్ సిగ్నల్ వరకు ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంజాగుట్ట, అమీర్ పేట్, బేగంపేట్ నుంచి వచ్చే వాహనాలు సైతం ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ఆఫీస్, షాపులకు వెళ్లే ప్రజలు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు. పది నిమిషాల జర్నీకి రెండు గంటలు వేచి చూడాల్సి వస్తుందని నగర ప్రజలు ఫైర్ అవుతున్నారు.