Home > తెలంగాణ > గెలుపు గుర్రాల వేటలో కేసీఆర్.. మెదక్, ఆదిలాబాద్లో ఆ ఇద్దరికి ఛాన్స్..!

గెలుపు గుర్రాల వేటలో కేసీఆర్.. మెదక్, ఆదిలాబాద్లో ఆ ఇద్దరికి ఛాన్స్..!

గెలుపు గుర్రాల వేటలో కేసీఆర్.. మెదక్, ఆదిలాబాద్లో ఆ ఇద్దరికి ఛాన్స్..!
X

లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో పార్టీలన్నీ గెలుపు గుర్రాల ఎంపికలో బిజీ అయ్యాయి. మరో రెండు నెలల సమయం మాత్రమే ఉండటంతో వీలైనంత తొందరగా పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించి ప్రచారం మొదలుపెట్టాలని భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం లోక్ సభ బరిలో నిలిపే అభ్యర్థుల ఎంపికలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారు చేసినట్లు బీఆర్ఎస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే మెదక్, ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థుల విషయంలో ఓ క్లారిటీకి వచ్చినట్లు సమాచారం. మెదక్ స్థానం నుంచి సిద్ధిపేట మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి అవకాశమివ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఆదిలాబాద్ ఎంపీగా గోడం నగేష్ను బరిలో నిలపాలని కేసీఆర్ భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

గతంలో సిద్ధిపేట కలెక్టర్గా పనిచేసిన వెంకట్రామిరెడ్డి 2021లో ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. కేసీఆర్ ఇచ్చిన హామీతోనే రిజైన్ చేసిన ఆయనకు ఉద్యోగం వదులుకున్న గంటల వ్యవధిలోనే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ప్రకటించారు. నిజానికి 2014 నుంచి వెంకట్రామిరెడ్డికి కేసీఆర్ తో సన్నిహిత సంబంధాలున్నాయి. ఆ కారణంగానే ఆయనకు మెదక్ జిల్లా పోస్టింగ్ ఇచ్చి అప్పటి ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతో కలిసి పని చేసేలా చూశారు. సీఎం కేసీఆర్‌కు, హరీశ్ రావుకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న వెంకట్రామిరెడ్డి 2018 ఎన్నికల సమయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. పునర్వ్యవస్థీకరణ అనంతరం కొత్తగా ఏర్పడిన సిద్దిపేట జిల్లాకు కేసీఆర్ ఏరికోరి మరీ వెంకట్రామిరెడ్డికి కలెక్టర్‌గా నియమించారు. సిద్దిపేట కలెక్టరేట్ ఓపెనింగ్ కార్యక్రమంలో ఆయన అప్పటి సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కడం పెద్ద దుమారమే రేపింది. ఆ తర్వాత దుబ్బాక ఉప ఎన్నిక సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా వెంకట్రామిరెడ్డిని బరిలో దిగుతారన్న వార్తలు వచ్చాయి. చివరకు కేసీఆర్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టి మండలికి పంపారు. తాజాగా రానున్న లోక్ సభ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిపేందుకు సిద్ధమయ్యారని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఇదిలా ఉంటే ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా కేసీఆర్ గోడం నగేష్ ను కేసీఆర్ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఏపీ అసెంబ్లీలో పిన్న వయసు కలిసిన ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించిన నగేష్‌.. తన తండ్రి దివంగత గోడం రామారావు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. 1994లో తొలిసారి బోథ్‌ శాసనసభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. గిరిజన, వికలాంగుల సంక్షేమ మంత్రిగా బాధ్యతలు చేప్టటారు. 1999లో ఎమ్మెల్యేగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన నగేష్ 2004లో మాత్రం ఓటమి చవిచూశారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి బోథ్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించి టీడీపీ పొలిట్‌ బ్యూరోలో స్థానం సంపాదించుకున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా, గిరిజన కార్పొరేషన్‌ ఛైర్మన్‌ గా పార్టీలో కీలక నేతల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు.

2014 మార్చిలో టీడీపీకి రాజీనామా చేసిన గోడం నగేష్ బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. అదే ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఆదిలాబాద్‌ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2018లో బోథ్‌ ఎమ్మెల్యే టిక్కెట్టు ఆశించి భంగపడ్డ ఆయన.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున బరిలో దిగారు. అయితే బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు చేతిలో ఓటమిపాలయ్యారు. ఈ క్రమంలోనే ఈసారి ఆదిలాబాద్ ఎంపీ టికెట్ ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు ఇస్తారని జోరుగా ప్రచారం సాగింది. కానీ స్థానిక నాయకుల అభిప్రాయాలు, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలించిన అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈసారి ఆదిలాబాద్ ఎంపీ టికెట్ గోడం నగేష్ కు ఇవ్వాలని నిర్ణయించినట్లు బీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.




Updated : 10 Jan 2024 7:16 PM IST
Tags:    
Next Story
Share it
Top