నేడు వీఆర్ఏలకు అలాట్మెంట్ ఆర్డర్లు
X
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన వీఆర్ఏలకు ఇవాళ అలాట్ మెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నారు. హైదరాబాద్ లోని సీసీఎల్ఏలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20,555 మంది వీఆర్ఏలను క్రమబద్దీకరిస్తూ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. వయసు, విద్యార్థతల ఆధారంగా వివిధ శాఖల్లో నియమించేందుకు సిద్ధమైంది. వీఆర్ఏల విద్యార్హతల ఆధారంగా ఆఫీస్ సబార్డినేట్, రికార్డ్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ పేస్కేల్ వర్తింపజేసింది.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వీఆర్ఏలలో 16,758 మంది 61 ఏండ్లలోపు వయసు వారుకాగా.. 61 ఏళ్లు దాటిన వీఆర్ఏలు 3797 మంది ఉన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఇటీవలే సుమారు 15 వేల పోస్టులను మంజూరు చేసింది. కలెక్టర్లు జిల్లాల వారీగా వీఆర్ఏల విద్యార్హత, వయసు తదితర అంశాలవారీగా జాబితాను సేకరించి, ప్రభుత్వానికి అందజేశారు. రెవెన్యూ శాఖ వారికి అలాట్మెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నది. నిర్ణీత గడువులోగా సంబంధిత శాఖలోని ఉన్నతాధికారులకు రిపోర్ట్ చేయాలి. అపాయింట్మెంట్ పూర్తికాగానే తహసీల్దార్లు తమ పరిధిలో నుంచి వీఆర్ఏలను రిలీవ్ చేయనున్నారు.