వరంగల్ మెడికో ప్రీతి కేసు.. సైఫ్‌పై సస్పెన్షన్ ఎత్తివేత!
X
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వరంగల్ మెడికో ధరావత్ ప్రీతి(26) సూసైడ్ కేసులో నిందితుడు డాక్టర్ సైఫ్‌కు ఊరట లభించింది. అతడి విధించిన ఏడాది సస్పెన్షన్‌ను తాత్కాలికంగా రద్దు చేశారు కాకతీయ మెడికల్ కాలేజీ అధికారులు. హైకోర్టు ఆదేశాలతో... సైఫ్ పై సస్పెన్ష్‌ను ఎత్తివేసినట్లు కేఎంసీ ప్రిన్సిపల్ డా. మోహన్ దాస్ ప్రకటించారు. దీంతో.. సైఫ్ తిరిగి క్లాసులకు హాజరయ్యేందుకు అనుమతి లభించినట్లయ్యింది.
డాక్టర్ సైఫ్ వేధింపుల కారణంగానే.. ప్రీతి బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. గత ఫిబ్రవరి 22 న ఎంజీఎంలో ఆమె ఆత్మహత్యా యత్నం చేయగా.. హైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పొందుతూ 26వ తేదీన కన్నుమూసింది. మరోవైపు ప్రీతి మృతికి సీనియర్ వైద్య విద్యార్థి సైఫ్ వేధింపులే కారణమని ఆమె పేరెంట్స్.. పోలీసులకు, కళాశాల ప్రిన్సిపల్ కు పిర్యాదు చేశారు. ర్యాగింగ్ యాక్ట్ తో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ క్రింద కేసు నమోదు చేసి సైఫ్ ను రిమాండ్‌కు తరలించారు. కాకతీయ యాంటీ ర్యాగింగ్ కమిటీ కూడా ప్రీతి మృతి కేసును సీరియస్‌గా తీసుకుంది. డాక్టర్ సైఫ్‌పై చర్యలు తీసుకుంటూ.. అతన్ని ఏడాదిపాటు సస్పెండ్ చేసింది.
ఏప్రిల్ 20న సైఫ్ బెయిల్‌పై బయటకు వచ్చాడు. కాలేజీ యాజమాన్యం ఏడాది పాటు తనను సస్పెండ్ చేయడాన్ని తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశాడు. ప్రీతి మృతి కేసులో తన వాదన వినకుండా... కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకుందంటూ కోర్టుకు విన్నవించుకున్నాడు. సైఫ్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు... నిందితుడిగా భావిస్తున్న వ్యక్తి వివరణను పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని తెలిపింది. విచారణ తిరిగి నిర్వహించాలని కేఎంసీ వైద్యాధికారులతో పాటు యాంటీ ర్యాగింగ్ కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. గత నెల 29న యాంటీ ర్యాగింగ్ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని కాలేజీ యాజమాన్యం సైఫ్ ను ఆదేశించింది. అయితే సైఫ్ ఈ సమావేశానికి హాజరుకాలేదు. ఈ విషయాన్ని కాలేజీ యాజమాన్యం హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. తాత్కాలికంగా సైఫ్ పై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని హైకోర్టు ఆదేశించింది. వారం రోజుల తర్వాత వివరణ తీసుకోవాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం... సైఫ్ సస్పెన్సన్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు కాకతీయ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రకటించారు.