CM KCR : ఉద్యోగుల జీతాలు పెంచుతాం.. సింగరేణి కార్మికులకు వెయ్యి కోట్లు : కేసీఆర్
X
ఉద్యోగులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే కొత్తగా పీఆర్సీని ప్రకటించి ఉద్యోగుల వేతనాలు పెంచుతామన్నారు. అప్పటివరకు మధ్యంతర భృతి చెల్లిస్తామని చెప్పారు. సింగరేణి కార్మికులకు దసరా, దీపావళి బోనస్‌గా రూ.వెయ్యి కోట్లు అందిస్తామని సీఎం తెలిపారు. గోల్కొండ కోటలో జెండా ఆవిష్కరించిన తర్వాత కేసీఆర్ ప్రసంగించారు. వచ్చే 3,4 ఏళ్లలో మెట్రో రైలు విస్తరణ పూర్తి చేయాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు.
కొత్త ప్రతిపాదనలతో హైదరాబాద్లో 415 కిలో మీటర్లకు మెట్రో విస్తరిస్తుందని కేసీఆర్ అన్నారు. రాష్ట్రానికి రూ. 2.51 లక్షల కోట్ల పెట్టుబడులతో కొత్త పరిశ్రమలు వచ్చాయని తెలిపారు. పారిశ్రామిక రంగంలో గత తొమ్మిదిన్నరేళ్ళలో 17.21 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. సాగునీటి రంగంలో స్వర్ణయుగం సృష్టించామన్న సీఎం.. కొందరు అల్పబుద్ధితో రైతుసంక్షేమ చర్యలకు వక్రభాష్యాలు చెబుతున్నారని విమర్శించారు.
పంట సాగుకు 3 గంటల కరెంట్ చాలని కొందరు విచిత్ర వ్యాఖ్యలు చేస్తున్నారని కేసీఆర్ అన్నారు. ఆ రైతు వ్యతిరేకులకు ప్రజలే తగిన బుద్ధి చెప్తారని మండిపడ్డారు. పాలమూరు రంగారెడ్డిని అడ్డుకునేందుకు విపక్షనేతలు యత్నించారని.. ఎన్‌జీటీలో కేసులు వేసి వారి వికృత మనస్తత్వాన్ని బయటపెట్టారని ఆరోపించారు. విద్రోహ మనస్తత్వంతో విపక్షాలు పెట్టిన కేసులు వీగిపోయాయని చెప్పారు. ఇటీవలే 'పాలమూరు రంగారెడ్డి'కి పర్యావరణ అనుమతులు వచ్చాయని.. సత్వరమే కాల్వల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రారంభిస్తోందని స్పష్టం చేశారు.