వాతావరణ శాఖ చల్లని కబురు..తెలంగాణలో తేలికపాటి వర్షాలు
X
గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఫిబ్రవరి దాటకముందే భానుడి భగభగలు పెరిగిపోయాయి. ఎండవేడిమితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే వాతావరణశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో రానున్న రెండు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా అక్కడక్కడ వర్షపు జల్లలు కురుస్తాయని వెదర్ డిపార్ట్మెంట్ సూచించింది. కాగా గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఖమ్మం, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాలో రాత్రిపూట ఉష్ణోగతలు పెరుగుతున్నాయి.
రాత్రి పూట సాధారణ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 శాతం పెరిగాయి.ఫిబ్రవరి 24 నుంచి 26 తేదీల్లో తెలంగాణలోని జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. తేలికపాటి వర్షాలు మాత్రమే కురుస్తాయని… ఎలాంటి హెచ్చరికలు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. ఆ తర్వాత మళ్లీ పొడి వాతావరణమే ఉంటుందని పేర్కొంది. ఏపీకి వర్ష సూచన ఇచ్చింది అమరావతి వాతావరణ కేంద్రం. ఉత్తర కోస్తా ప్రాంతంలో రేపు, ఎల్లుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతంలో కూడా రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల పొడి వాతావరణమే ఉంటుందని తెలిపింది.