Heavy Rains : వాతావరణ శాఖ హెచ్చరిక..మరో రెండు రోజులు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు
X
తెలంగాణలో వానలు దంచికొడుతున్నాయి. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో ఇదే పరిస్థితి మరో రెండు రోజులు కొనసాగుతుందని తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది పలు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. రానున్న 48 గంటల పాటు తేలికపాటి వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురుసే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ్టి నుంచి మంగళవారం ఉదయం వరకు జగిత్యాల, కరీంనగర్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
ఈ 7 జిల్లాలతో పాటు ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, హన్మకొండ, సిద్దిపేట, కామారెడ్డి, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లోనూ కుంభవృష్టిగా వానలు కురుస్తాయని తెలిపింది. అంతే కాదు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేశారు అధికారులు.