భానుడి భగభగ.. 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్..
X
తెలంగాణలో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. అన్ని జిల్లాల్లోనూ జనం ఎండ వేడి, ఉక్కపోతతో అల్లాడుతున్నారు. శుక్రవారం 13 జిల్లాల్లోని 47 మండలాల్లో వడగాల్పులతో జనం నానా ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలోని 10 మండలాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45-46.5 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉంది. జిల్లాలోని పాల్వంచ, ములకలపల్లి, దమ్మపేట, మణుగూరు, ఖమ్మం జిల్లాలో సింగరేణి, వేంసూరు మండలాల్లో తీవ్రమైన వడగాలులు వీచాయి. అక్కడ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 6.5 డిగ్రీలపైన నమోదయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హనుమకొండ, మహబూబాబాద్, సూర్యాపేట, జనగామ, కుమురం భీం ఆసిఫాబాద్, పెద్దపల్లి, సిద్దిపేట, వరంగల్, ఆదిలాబాద్, నల్గొండ, కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది.
శని, ఆదివారాల్లోనూ రాష్ట్రంలో కొన్ని చోట్ల వడగాలులు వీచే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వడగాడ్పులు వీయవచ్చంటూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అయితే సాయంత్రానికి వాతావరణంలో మార్పు వస్తుందని, కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఉత్తర ఛత్తీస్‌గఢ్ నుంచి తెలంగాణ మీదుగా ఉత్తర కర్ణాటక వరకు విస్తరించిన ద్రోణి బలహీన పడి వాయవ్య, పశ్చిమ దిశల నుంచి గాలులు వీస్తుండటంతో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు తగ్గడం లేదని అంటున్నారు.