ఐదు రోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్
X
తెలంగాణలో రానున్న ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రుతుపవనాల ప్రభావంతో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, ములుగు, కొత్తగూడెం, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది. గురువారం ఉదయం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండలో భారీ వానలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
గురువారం నుంచి శుక్రవారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. శుక్రవారం నుంచి శనివారం వరకు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో భారీగా వానలు పడతాయని చెప్పింది. శనివారం నుంచి ఆదివారం వరకు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో భారీ వానలు పడే సూచనలున్నాయని అధికారులు చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేశారు.
మంగళవారం ఆదిలాబాద్ జిల్లాలోని నార్నూర్‌లో అత్యధికంగా 126 మి.మీ. వర్షపాతం నమోదైంది. నిర్మల్ జిల్లాలో దస్తురాబాద్ మండలంలో అత్యధికంగా 54.4 మి.మీ వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లాలో బోధన్ మండలంలో అత్యధికంగా 44 మి.మీల వర్షపాతం నమోదైంది. కాగా, ఖమ్మం జిల్లాలో అత్యధికంగా ఏన్కూరులో 21.6 మిల్లీ మీటర్ల వర్షం నమోదైంది. అయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా అశ్వాపురంలో 60.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.