వెంటాడుతున్న వరుణుడు.. సోమవారం నుంచి మళ్లీ భారీ వర్షాలు
X
తెలంగాణపై వరుణుడి ప్రకోపం కొనసాగుతోంది. నాలుగు రోజుల పాటు కురిసిన వర్షాలతో నానా అవస్థలు పడుతున్న జనానికి వాతావరణ శాఖ మళ్లీ షాకిచ్చే వార్త చెప్పింది. సోమవారం నుంచి మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని ప్రకటించింది. దక్షిణ ఒడిశా - ఉత్తర ఆంధ్రా సమీపంలోని వాయువ్య బంగాళాఖాతం, పరిసరాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 24న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ నెల 24వ తేదీ నుంచి 3, 4 రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిస్తాయని అన్నారు. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించారు.
ఉరుములు మెరుపులతో కూడిన వాన
ఇదిలా ఉంటే శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలతో పాటు కొత్తగూడెం, నిజామాబాద్ జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వాన కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. ఆదివారం నుంచి సోమవారం వరకు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాలు పడతాయని అధికారులు చెప్పారు.
జిల్లాలకు ఎల్లో అలర్ట్
సోమవారం నుంచి మంగళవారం వరకు ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మల్కాజ్‌గిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మంగళవారం నుంచి బుధవారం వరకు ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌లో అతిభారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. కొత్తగూడెం, భువనగిరి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని, అదే సమయంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
హిమాయత్ సాగర్ నాలుగు గేట్లు ఎత్తివేత
ఇదిలా ఉంటే భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ జంట జలాశయాల్లో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. హిమాయత్ సాగర్‌కు 3000 క్యూసెక్కులు, ఉస్మాన్ సాగర్‌కు 400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,790 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1785.70 అడుగులకు చేరింది. వరద పెరగడంతో శుక్రవారం హిమాయత్ సాగర్ రిజర్వాయర్ రెండు గేట్లను ఒక అడుగు మేర ఎత్తి వరద నీటిని మూసీలోకి విడుదల చేశారు. అయినా ఎగువ ప్రాంతాల నుంచి వరద తగ్గకపోవడంతో.. నేడు శనివారం మరో రెండు గేట్లను ఎత్తిన అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు హిమాయత్ సాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టమైన 1763.50 అడుగులకు చేరింది.