బండి సంజయ్ని అధ్యక్షుడిగా తొలగించడానికి కారణం ఏంటి..?
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీసిస్తున్న వేళ.. బీజీపీ అధిష్టానం కీలక మార్పులు తీసుకొచ్చింది. స్టేట్ చీఫ్ బండి సంజయ్ ని తొలగించి.. మంత్రి కిషన్ రెడ్డికి అధ్యక్ష పదవిని కట్టబెట్టింది. రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఊపందుకునేందుకు ఎంతగానో కృషి చేసిన బండి సంజయ్ ని.. ఉన్నటుండి అధ్యక్ష పదవి నుంచి తప్పించడంపై ఆయన అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. పాదయాత్రలు చేస్తూ ప్రజల సమస్యలపై కొట్లాడిన బండి.. పార్టీని జనాలకు చేరువ చేసేందుకు శ్రమించారు. ఆయన సేవలకు అధిష్టానం కూడా చాలా సార్లు ప్రశంసించింది.
కార్పొరేటర్ నుంచి.. అధ్యక్షుడి దాకా:
తెలంగాణలో పార్టీ అభివృద్ధి, కార్యకర్తల శ్రేయస్సు కోసం బండి చేసిన కృషిని పార్టీ శ్రేణులు ట్విట్టర్ వేదికగా గుర్తుచేసుకుంటున్నారు. ‘నమ్మిన సిద్ధాంతం కోసం కష్టపడుతూ, ప్రజల సమస్యలపై పోరాడుతూ.. ఓ సాధారణ బ్యాంక్ డైరెక్టర్ స్థాయి నుంచి కార్పొరేటర్ గా, ఎంపీగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగారు. పార్టీ బలోపేతానికి అనేక సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్నార’ని అంటున్నారు.
కీలక ఎన్నికల్లో గెలుపులు:
బండి సంజయ్ నేతృత్వంలో రాష్ట్రంలో బీజేపీ పార్టీ కీలకమైన ఉపఎన్నికల్లో గెలుపొందింది. హుజురాబాద్, దుబ్బాకలో గెలిచి.. రాష్ట్రంలో ఊపందుకుంది. తర్వాత టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు, జీహెచ్ఎంసీలో ఎన్నికల్లో 48 స్థానాల్లో గెలుపొందింది. పార్టీ కోసం ఇంత చేసిన బండికి.. మోదీ కేబినెట్ లో తప్పక చోటు దక్కుతుందని కార్యకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అధ్యక్షుడిగా ఎందుకు తొలగించారు:
బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తొలగించడంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఇతర పార్టీ శ్రేణులు కొత్త కొత్త ఊహాగానాలు లేవనెత్తుతున్నారు. ఈ క్రమంలో క్లారిటీ ఇచ్చిన అధిష్టానం.. పార్టీ సంస్థాగత మార్పుల్లో భాగంగానే సంజయ్ ను తొలగించినట్లు తెలిపింది. అంతేగానీ ఆయనపై ఎలాంటి వ్యక్తిగత కారణాలు ఏం లేవని చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో ఆయన సేవలకు గుర్తుగా పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.