కేటీఆర్ను మిస్సవుతున్న నెటిజన్స్... ఇంతకీ ఐటీ పగ్గాలు ఎవరికిస్తారు..?
X
అసెంబ్లీ ఎన్నికల్లో 64సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ క్లియర్ మెజార్టీతో ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. మరికాసేపట్లో సీఎం ఎవరన్నది తేలిపోనుంది. అయితే నిన్న ఫలితాలు వెలువడినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వైరల్గా మారింది. కేటీఆర్ లాంటి ఐటీ మినిస్టర్ ను మిస్ అవుతామన్నది దాని సారాంశం. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ బాధ్యతల్ని ఎవరికి అప్పజెప్తారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. కాబోయే ఐటీ మినిస్టర్ ఎవరన్న దానిపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్న రెండు పర్యాయాలు కేటీఆర్ ఐటీ మంత్రిగా ఉన్నారు. తన సమర్థతతో ఐటీ రంగంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ఉద్యోగావకాశాలు కల్పించడమే కాకుండా యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించారు. తొలి ఏడాదిలోనే టీ-హబ్ కు అంకురార్పణ చేసి స్టార్టప్లకు ఊతమిచ్చారు. నిజానికి టీ హబ్ కేటీఆర్ ఆలోచనల్లోంచి పుట్టిందేననడంలో ఎలాంటి సందేహం లేదు. ఏడేళ్లు తిరిగే సరికి టీ-హబ్ ప్రపంచ స్థాయి స్టార్టప్‌లకు వేదికగా మారింది.
మరోవైపు ఐటీ రంగాన్ని కేటీఆర్ కేవలం హైదరాబాద్ కే పరిమితం చేయలేదు. టైర్ 2 నగరాలకు దాన్ని విస్తరించారు. కరీంనగర్, ఖమ్మం నగరాల్లో ఐటీ టవర్స్ నిర్మించి స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. ఐటీ మినిస్టర్‌గా కేటీఆర్ ఎన్నో అంతర్జాతీయ కంపెనీలను హైదరాబాద్ తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇప్పటి వరకు కేటీఆర్ నడిపిన ఐటీ రంగం పగ్గాలు ఎవరికి అప్పగిస్తారన్న అంశంపై చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఐటీ మినిస్టర్గా దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు అవకాశం కల్పిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఉన్నత విద్యావంతుడు, విషయ పరిజ్ఞానం ఉన్న శ్రీధర్ బాబుకు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. మొత్తమ్మీద కేటీఆర్ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారన్నది మరికొద్ది రోజుల్లో తేలనుంది.