Home > తెలంగాణ > కాంగ్రెస్లో షర్మిల పార్టీ విలీనం.. సంబురంలో గులాబీ దళం..!

కాంగ్రెస్లో షర్మిల పార్టీ విలీనం.. సంబురంలో గులాబీ దళం..!

కాంగ్రెస్లో షర్మిల పార్టీ విలీనం.. సంబురంలో గులాబీ దళం..!
X

తెలంగాణ కాంగ్రెస్లో మరో అలజడి మొదలైంది. వైఎస్సాఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం ఖాయమన్న వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ వెళ్లిన షర్మిల కాంగ్రెస్ అగ్రనేతలైన సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో సమావేశం కావడం హాట్ టాపిక్గా మారింది. భేటీ అనంతరం సీఎం కేసీఆర్కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందంటూ ఆమె చేసిన వ్యాఖ్యలతో విలీనం ఇక లాంఛనమే అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇంతకీ షర్మిల పార్టీ విలీనం తెలంగాణ రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది. ఆమె కాంగ్రెస్లో చేరితే లాభపడేదెవరు?

విలీన చర్చలు సఫలం..?

తెలంగాణలో ఈసారి అధికారంలోకి రావాలని గట్టి పట్టుదలతో ఉన్న కాంగ్రెస్లో కర్నాటక ఎన్నికల ఫలితాలు మరింత జోష్ నింపాయి. అప్పటి నుంచి మరింత జోరు పెంచిన కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించేందుకు వ్యూహాలకు పదనుపెడుతోంది. ఇదే సమయంలో వైఎస్సాఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయనున్నారంటూ

ఊహాగానాలు జోరందుకున్నాయి. అందుకు తగ్గట్లే ఆమె కర్నాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్తో పలుమార్లు భేటీ కావడం ఆ తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ పెద్దలతో వరుస భేటీలు నిర్వహించడం వాటికి బలం చేకూర్చాయి. తాజాగా గురువారం ఢిల్లీ వెళ్లిన షర్మిల, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో ప్రత్యేకంగా సమావేశం కావడంతో పార్టీ విలీనం ఖాయమన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆమె ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో దిగుతారని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది.

వ్యతిరేకిస్తున్న రేవంత్

షర్మిల పార్టీ విలీనం అంశం తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి వర్గపోరుకు దారి తీసినట్లు కనిపిస్తోంది. ఆమె రాకను కొందరు స్వాగతిస్తుండగా.. మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి షర్మిలను పార్టీలోకి తీసుకోవడాన్ని మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఏపీలో ఆమె సేవలు వినియోగించుకోవాలని, తెలంగాణ రాజకీయాల్లో మాత్రం షర్మిల తలదూర్చకుండా చూడాలని పార్టీ హైకమాండ్ కు చెప్పినట్లు సమాచారం. టీపీసీసీ చీఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో వైఎస్ షర్మిల కర్నాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్తో ఢిల్లీలో మంత్రాంగం నడిపారు.

షర్మిలకు మద్దతుగా ఓ వర్గం

మరికొందరు కాంగ్రెస్ నేతలు మాత్రం షర్మిలకు రెడ్ కార్పెట్ పరిచేందుకు సిద్ధంగా ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ఆస్తి అన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆమె బిడ్డ షర్మిల పార్టీలోకి వస్తే స్వాగతిస్తామని చెబుతున్నారు. ఈ విషయంలో అధిష్టానానికి సైతం తన అభిప్రాయం గట్టిగా చెబుతానని అంటున్నారు. రాష్ట్రంలో వైఎస్ అభిమానులు చాలా మంది ఉన్నారని, షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీకి నాలుగు ఓట్లు ఎక్కువ వచ్చినా చాలన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఆమెను పార్టీలో చేర్చుకుని పాలేరు టికెట్ ఇవ్వాలని అంటున్నారు.

బీఆర్ఎస్ నెత్తిన పాలు

ఇదిలా ఉంటే ఢిల్లీ మీటింగ్ అనంతరం వైఎస్ షర్మిల సీఎం కేసీఆర్కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందంటూ ఇచ్చిన వార్నింగ్ను బీఆర్ఎస్ శ్రేణులు లైట్ తీసుకుంటున్నాయి. షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనమైతే బీఆర్ఎస్ నెత్తిన పాలుపోసినట్లేనని అంటున్నారు. గతంలో సమైక్యవాది చంద్రబాబును బూచిగా చూపి కేసీఆర్ గంపగుత్తగా ఓట్లు దండుకున్నారు. ఈసారి బీఆర్ఎస్కు ఓట్లు తెచ్చే పని కాంగ్రెస్ వదిలే బాణం షర్మిల చేసి పెడుతుందని అంటున్నారు. కరుడుగట్టిన సమైక్యవాది అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డైన వైఎస్ షర్మిల తండ్రిబాటలోనే నడిచారు. విభజన జరిగితే రాష్ట్రంలో అడుగుపెట్టాలంటే పాస్పోర్ట్ కావాలని వైఎస్ అంటే.. షర్మిల తానేం తక్కువ కాదన్నట్లు సందు దొరికినప్పుడల్లా తెలంగాణపై విషం చిమ్మారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆమెను తెలంగాణ సమాజం ఏనాటికీ అంగీకరించదన్నది బీఆర్ఎస్ వాదన. ఒకవేళ ఆమె పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తే అదే బీఆర్ఎస్కు అస్త్రంగా మారుతుందని గులాబీ శ్రేణులు అంటున్నాయి. షర్మిల రాకతో నాలుగు ఓట్లు ఎక్కువ రావడం మాట అటుంచితే వచ్చే నాలుగు ఓట్లు కూడా కాంగ్రెస్కు రాకుండాపోతాయని సటైర్లు వేస్తున్నారు.


Updated : 31 Aug 2023 6:18 PM IST
Tags:    
Next Story
Share it
Top