కంటోన్మెంట్ కన్ఫ్యూజన్లో గులాబీ బాస్..
X
తెలంగాణలో ఎన్నికల హడావిడి నెలకొంది. మరో మూడు నెలల్లో ఎన్నికలు ఉండడంతో పార్టీల్లో టిక్కెట్ల సందడి షురూ అయ్యింది. ఆశావాహులు పలు సీట్లపై కన్నేసి అధిష్టానాన్ని మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. అధికార బీఆర్ఎస్లో టిక్కెట్ల పంచాయతీ జోరుగా నడుస్తోంది. ఇక కంటోన్మెంట్ టిక్కెట్ కోసం ఆ పార్టీలో గట్టి పోటీ ఉంది. ఎమ్మెల్యే సాయన్న అకాల మరణంతో ఆ స్థానానికి పలువురు నేతలు కర్చీఫ్ వేసే పనిలో పడ్డారు.
సాయన్న కూతురు లాస్యనందితతోపాటు ఇద్దరు కార్పోరేషన్ చైర్మన్లు మన్నె క్రిశాంక్, గజ్వెల నాగేష్ సహా మర్రి రాజశేఖర్ రెడ్డి కంటోన్మెంట్ సీటుపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సాయన్నకు కంటోన్మెంట్పై గట్టి పట్టు ఉంది. సాయన్న అంత్యక్రియల్లో పాల్గొన్న కేసీఆర్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. దీంతో ఈ సారి ఖచ్చితంగా టిక్కెట్ తనకే వస్తుందనే ధీమాలో సాయన్న కూతురు లాస్యనందిత ఉన్నారు. ఇప్పటికే ఆమెకు కవాడిగూడ కార్పొరేటర్గా పనిచేసిన అనుభవం ఉంది. సాయన్న వర్గీయులు సైతం లాస్యకే టిక్కెట్ ఇవ్వాలని డిమాండ్లు చేస్తున్నారు. లాస్యకు టిక్కెడ్ ఇవ్వడమే సాయన్నకు ఇచ్చే తగిన గౌరవం అని చెబుతున్నారు.
గజ్జెల నాగేష్..
ప్రస్తుతం గజ్జెల నాగేష్ రాష్ట్ర బేవరేజస్ కార్పోరేషన్ చైర్మన్గా ఉన్నారు. 2014లో బీఆర్ఎస్ నుంచి కంటోన్మెంట్ బరిలో నిలిచిన నాగేష్.. టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన సాయన్న చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత సాయన్న బీఆర్ఎస్లో చేరడం.. 2018లో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా పోటీచేసి గెలవడం జరిగిపోయాయి. ఈ సారి సాయన్న లేకపోవడంతో ఎలాగైనా కంటోన్మెంట్ నుంచి పోటీచేయాలని నాగేష్ ప్రయత్నాలు చేస్తున్నారు. అధిష్ఠానం మెప్పుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది.
మన్నే క్రిశాంక్..
మన్నే క్రిశాంక్ ప్రస్తుతం మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. అటు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంచార్జ్ గానూ వ్యవహరిస్తూ.. ప్రత్యర్థి పార్టీలకు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కంటోన్మెంట్ నుంచి పోటీ చేసేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే బస్తీ నిద్ర కార్యక్రమంతో నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అటు కేటీఆర్కు సన్నిహితుడు కావడం మన్నే క్రిశాంక్కు కలిసొచ్చే అంశం.
జహీరాబాద్కు షిఫ్ట్
ఇక ఎర్రోళ్ల శ్రీనివాస్ సైతం కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారట. అయితే కేసీఆర్ దగ్గర ఈ విషయం ప్రస్తావించగా.. కంటోన్మెంట్ బదులు జహీరాబాద్ నుంచి పోటీ చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఎర్రోళ్ల శ్రీనివాస్కు జహీరాబాద్ సీటు ఫిక్స్ అయినట్లు సమాచారం. ఇప్పటికే ఆయన ఆ నియోజకవర్గంలో పాగా వేసి.. ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారని టాక్.
మిగితా నలుగురు ఆశావాహుల్లో గులాబీ బాస్ ఎవరికి టిక్కెట్ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నలుగురిలో మన్నే క్రిశాంక్ వైపు ఆయన మొగ్గు చూపుతారని తెలుస్తోంది. కేటీఆర్ ఆశీస్సులు పుష్కలంగా ఉండడంతో పాటు పార్టీ సోషల్ మీడియా వింగ్ను సూపర్బ్గా హ్యాండిల్ చేస్తున్నారనే పేరు ఉంది. మరోవైపు తన మాటలతో విపక్ష నాయకులకు గట్టి కౌంటర్లు ఇస్తారనే అభిప్రాయాలున్నాయి. అంతేగాకుండా పలు సర్వేలు కూడా క్రిశాంక్ కు పాజిటివ్గా వచ్చినట్లు సమాచారం. దీంతో కంటోన్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థిగా క్రిశాంక్ బరిలో నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి.