Home > తెలంగాణ > కామ్రేడ్లకు కేసీఆర్ మొండిచేయి అందుకేనా? ‘ఇండియా’ దెబ్బ, పార్టీల పరిస్థితి!

కామ్రేడ్లకు కేసీఆర్ మొండిచేయి అందుకేనా? ‘ఇండియా’ దెబ్బ, పార్టీల పరిస్థితి!

కామ్రేడ్లకు కేసీఆర్ మొండిచేయి అందుకేనా? ‘ఇండియా’ దెబ్బ, పార్టీల పరిస్థితి!
X

తెలంగాణ కామ్రేడ్ల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడైంది. సొంత బలంపై ఆత్మవిశ్వాసం కోల్పోయిన కమ్యూనిస్టులు ఏదో ఒక పార్టీ వెంట వెళ్లి ఈసారైనా అసెంబ్లీలోకి అడుగుపెట్టడానికి చేసిన ప్రయత్నాలు నీరుగారాయి. సీపీఐ, సీపీఎంలతో పొత్తు, సీట్ల పంపిణీపై చర్చలు కొలిక్కి రాకముందే కేసీఆర్ జాబితా ప్రకటించేసి, తాంబూలాలిచ్చేశాను పోండి అని అన్నారు. చెరో మూడు సీట్లు కోరిన సీపీఎం, సీపీఐలకు ఒక్కసీటు కూడా కేటాయించే అకాశం లేదని 115 మంది బీఆర్ఎస్ అభ్యర్థుల అధికారిక జాబితాలో తేలిపోయింది. మిగిలిన నాలుగు సీట్లలో అంతర్గత పంచాయతీల వల్లే అభ్యర్థులను కేటాయించలేకపోయారు. అభ్యర్థులను ప్రకటించిన 115 స్థానాల్లో కమ్యూనిస్టులు కోరిన స్థానాలు కూడా ఉండడంతో ఎర్రజెండాల ఆశలు గల్లంతయ్యాయి.





బీఆర్ఎస్‌కు ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం కామ్రేడ్లు కష్టించి పనిచేశారు. బీజేపీకి చెక్ పెట్టాలన్న ‘జాతీయ లక్ష్యం’తో కారుకు మద్దతు పలికారు. ఆ ఊపులో కేసీఆర్‌తో దోస్తానీ బలపడుతుందని, అసెంబ్లీ ఎన్నికల్లో ఉనికి చాటుకోవచ్చని ఆశించారు. సీపీఎం, సీపీఐలకు చెరొక అసెంబ్లీ సీటు ఇస్తామని బీఆర్ఎస్ నేతలు చేసిన ప్రతిపాదనకు కామ్రేడ్లు ఒప్పుకోలేదు. తమకు చెరో మూడు కావాలని పట్టుబట్టారు. చర్చలు స్తంభించాయి. ఈ లోపు కేసీఆర్ జాబితాను ప్రకటించేశారు. మునుగోడు, భద్రాచలం, పాలేరు, కొత్తగూడెం, మిర్యాలగూడ, బెల్లంపల్లిలపై కామ్రేడ్ల ఆశలు గల్లంతయ్యాయి.

కాంగ్రెస్‌తో ఉంటే ఎలా సాధ్యం..?

మారిన రాజకీయ పరిస్థితుల బట్టి కమ్యూనిస్టులతో వెళ్లడం సరికాదని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ సారథ్యంలో ‘ఇండియా’ కూటమిలో చేరడంతో వాటితో పొత్తు సాధ్యమయ్యే పరిస్థితి లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్‌తో తలపడుతూ ఆ పార్టీ కూటమిలోని వామపక్షాలతో పొత్తు విధానపరంగా, నైతికంగా సరికాదని భావిస్తున్నారు. దీనికి తోడు కామ్రేడ్లు అడుగుతున్న ఆరు సీట్లలో ఆ పార్టీలకు బలమైన అభ్యర్థులు లేరు. తాము ఎంత పుష్ చేసిన ఫలితం ఉండకపోవచ్చని కేసీఆర్ భావించినట్లు కనిపిస్తోంది. ఆరు కాకపోయినా రెండు సీట్లు ఇచ్చినా ‘పోగొట్టుకునే రిస్క్’ ఎందుకని పొత్తుకు దూరంగా ఉండినట్లు సమాచారం. ఒకవేళ పొత్తు కుదిరినా కామ్రేడ్లు తాము పోటీ చేసే స్థానాల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేయాల్సి సంక్లిష్ట పరిస్థితి ఉంటుంది! ఆరు సీట్ల కోసం కాకుండా కనీసం, భద్రాచలం, మునుగోడు అయినా తమకిస్తారని ఆశపడిన కమ్యూనిస్టులు ఇటు రాష్ట్ర, అటు జాతీయ రాజకీయాల్ల మధ్య నలిగి మరోసారి చట్టసభ ముఖం చూసే అవకాశం కోల్పోయారు!


Updated : 21 Aug 2023 6:03 PM IST
Tags:    
Next Story
Share it
Top