Home > తెలంగాణ > తెలంగాణకు పసుపు బోర్డు ఎందుకు కావాలి..? రైతులకు ఉపయోగం ఏంటీ..?

తెలంగాణకు పసుపు బోర్డు ఎందుకు కావాలి..? రైతులకు ఉపయోగం ఏంటీ..?

తెలంగాణకు పసుపు బోర్డు ఎందుకు కావాలి..? రైతులకు ఉపయోగం ఏంటీ..?
X

పసుపు బోర్డు.. నిజామాబాద్ రైతుల ఎన్నో ఏళ కల. ఈ కల కోసం అక్కడి రైతులు ఎన్నో పోరాటాలు, ఇంకెన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. పాలకులను ఎన్నిసార్లు ప్రశ్నించినా లాభం లేకుండా పోయింది. నాయకులు పసుపు బోర్డు అంటూ రైతులను మభ్యపెట్టడం గద్దెనెక్కిన తర్వాత గారడీ చేయడం రైతులకు అలవాటుగా మారింది. కానీ ఈ సారి కథ మారింది. తెలంగాణకు పుసుపు బోర్డు వచ్చింది. తెలంగాణలో నేషనల్ టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. అయితే ఈ బోర్డు వల్ల రైతులకు జరిగే మేలు ఏంటీ..? తెలంగాణకు ఈ బోర్డు ఎందుకు అవసరం..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం...

నిజామాబాద్ టాప్..

తెలంగాణ దేశంలోనే పసుపును ఉత్పత్తి చేసే అతిపెద్ద రాష్ట్రం. అందులో నిజామాబాద్ జిల్లాలో రైతులు ఎక్కువగా పసుపు పంట పండిస్తారు. ఇక్కడ పండే పసుపుకి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉంది. ఇంకా చెప్పాలంటే ఆసియాలోనే అత్యధికంగా పసుపు పండేది నిజామాబాద్‌లోనే. ప్రతి ఏటా నిజామాబాద్ జిల్లాలోనే 30 నుంచి 35 వేల ఎకరాల్లో పసుపు సాగవుతుంది. నిజామాబాద్ జిల్లాలో ఎన్నో కుటుంబాలు పసుపు ఉత్పత్తిపై ఆధారపడి ఉన్నాయి. ఈ క్రమంలో పసుపు బోర్డు కోసం ఇక్కడి రైతులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.

పసుపుకు ప్రాధాన్యం లేదు..

1987లో అన్ని రకాల సుగంధ ద్రవ్యాలకు కలిపి సుగంధ ద్రవ్యాల బోర్డును కేరళలోని కొచ్చిలో ఏర్పాటు చేశారు. 2010లో కేరళ, తమిళనాడు, సిక్కిం, గుంటూరు, వరంగల్ పట్టణాల్లో ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. స్పైసెస్ బోర్డు 52 సుగంధ ద్రవ్యాల కోసం పనిచేస్తుంది. వాటిల్లో పసుపు ఒకటి. ఆ బోర్డులో పసుపుకు అంతగా ప్రాధాన్యం లేదు. దేశంలో ఉండే పసుపులో సుమారు 70శాతం నిజామాబాద్ లోనే పండుతుంది. అందుకే పసుపు బోర్డు కావాలని ఇక్కడి రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ బోర్డు ఏర్పాటు చేస్తే అది కేవలం పసుపు పంటపైనే ఫోకస్ పెడుతుంది. దీంతో రైతులకు ఎంతో లాభం చేకూరుతుంది.

పసుపు బోర్డుపై బాండ్ పేపర్..

2019 లోక్సభ ఎన్నికల సమయంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్.. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని బాండ్ పేపర్‌లో సంతకం చేసి మరీ రైతులకు హామీ ఇచ్చారు. నాలుగేళ్లు గడిచిన ఆ దిశగా అడుగులు పడలేదు. నిజామాబాద్ ప్రాంతంలో స్పైస్‌బోర్డు ప్రాంతీయ కార్యాలయం, ఎక్స్‌టెన్షన్ సెంటర్ ఏర్పాటు కేంద్రం ఏర్పాటు చేసింది. కానీ పసుపు బోర్డు డిమాండ్పై మాత్రం స్పందించలేదు. పసుపు బోర్డు కంటే ఎక్కువ లాభాలు స్పైస్ బోర్డు రీజినల్ ఆఫీసుతో ఉంటాయని అప్పట్లు బీజేపీ నేతలు చెప్పకొచ్చారు. కానీ రైతులు మాత్రం వెనక్కి తగ్గలేదు.

పసుపు బోర్డుపై పోరుబాట

ఏళ్లు గడుస్తున్నా హామీని నెరవేర్చకపోవడంతో నిజామాబాద్ రైతులు ఎన్నోసార్లు రోడెక్కారు. ఎంపీ అర్వింద్కు నిరసనగా ఆందోళన బాట పట్టారు. పలుచోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన ఎంపీ అర్వింద్ను అడ్డుకుని నిలదీశారు. అటు ఎమ్మెల్సీ కవిత సైతం దీనిపై ప్రశ్నిస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఆందోళనలు కూడా చేపట్టారు. 2023 పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేసే ప్రతిపాదనలు లేవని కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ తెలిపారు. దీంతో బోర్డు వస్తుందన్న ఆశలు రైతుల్లో సన్నగిల్లాయి.

ఈ క్రమంలో రైతులకు ప్రధాని మోదీ గుడ్ న్యూస్ చెప్పారు. ఎవరూ ఊహించని విధంగా ఆయన తెలంగాణకు పసుపు బోర్డు ప్రకటించారు. పసుపు రైతుల కోసం నేషనల్ టర్మరిక్ బోర్డు ఏర్పాటు చేస్తామని మహబూబ్ నగర్లో జరిగిన సభలో చెప్పారు. దీంతో నిజామాబాద్ రైతుల ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. ఈ కల కోసం రైతుల ఎన్నో త్యాగాలు, ఎన్నో పోరాటాలు చేశారు. ఎట్టకేలకు పసుపు బోర్డు ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముంగిట పసుపు బోర్డు ప్రకటించడంతో తెలంగాణలో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారనున్నాయి.


Updated : 1 Oct 2023 12:05 PM GMT
Tags:    
Next Story
Share it
Top