Mla Malla Reddy : ఆ టికెట్ నా కుమారుడికి ఇవ్వాలని అడుగుతున్నా.. - మల్లారెడ్డి
X
సీఎం రేవంత్ రెడ్డితో త్వరలో భేటీ అవుతానని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. మీడియాతో చిట్ చాట్లో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో రేవంత్, తాను టీడీపీలో కలిసి పనిచేసిన విషయాన్ని మల్లారెడ్డి గుర్తు చేశారు. ఆ సాన్నిహిత్యంతోనే నియోజకవర్గ అభివృద్ధి పనులపై చర్చించేందుకు ఆయనతో భేటీకానున్నట్లు చెప్పారు. ఎలాంటి చర్చకు తావులేకుండా రేవంత్ను కలిసే ముందు మీడియాకు కచ్చితంగా సమాచారం ఇస్తానని మల్లారెడ్డి స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ ఓడిపోతుందని కలలో కూడా అనుకోలేదని మల్లారెడ్డి అన్నారు. తాము ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదని చెప్పారు. మరోవైపు ఎన్నికల్లో పోటీపై మల్లారెడ్డి మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలే తనకు చివరివని స్పష్టం చేశారు. మల్కాజ్ గిరి ఎంపీగా తనను పోటీ చేయమని బీఆర్ఎస్ హైకమాండ్ చెప్పిందని, అయితే తాను మాత్రం ఆ టికెట్ తన కొడుకు భద్రారెడ్డికి ఇవ్వాలని అడిగినట్లు మల్లారెడ్డి స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే బుధవారం మేడ్చల్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మల్లారెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తన వయస్సు 71 ఏండ్లన్న మల్లారెడ్డి.. వచ్చే ఏ ఎన్నికల్లోనూ తాను పోటీ చేయనని స్పష్టం చేశారు. ఇంతకాలం తనకు అండగా నిలిచిన కార్యకర్తలకు కృతజ్ఞతలు చెప్పారు. ఓ సారి ఎంపీగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని.. కార్యకర్తలు, ప్రజల మద్దతుతో ఓ సారి మంత్రిని కూడా అయ్యారని మల్లారెడ్డి గుర్తు చేసుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు 95 శాతం న్యాయం చేశానన్న ఆయన.. భవిష్యత్తులోనూ ప్రజా సేవ కొనసాగిస్తానని స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలే తనకు కొడుకులు, కూతుళ్లు, బంధువులని మల్లారెడ్డి భావోద్వేగానికి గురయ్యారు.