7 దశాబ్దాల్లో అసెంబ్లీకి వెళ్లింది 10 మంది మహిళలే
X
రాజకీయాలను శాసిస్తూ, గెలుపోటములను నిర్ణయించే స్థితిలో మహిళలు ఉన్నా.. అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం వారి ప్రధాన్యత అంతంత మాత్రమే. 66 ఏళ్ల ఎన్నికల చరిత్రలో గ్రేటర్ పరిధిలో కేవలం 10 మంది మహిళలు మాత్రమే అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1952లో నియోజకవర్గాలు ఏర్పాడినప్పటి నుంచి ఇప్పటి వరకు 10 మందికి మాత్రమే అవకాశం వచ్చింది. కొన్ని నియోజకవర్గాల్లో మహిళలు ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగినా అంతగా ప్రభావం చూపలేకపోయారు. 1967, 1972 ఎన్నికల్లో ఎస్సీ రిజర్వ్‌డ్ కేటగిరీలో కాంగ్రెస్ పార్టీ తరుపున మేడ్చల్ నుంచి పోటీ చేసి గెలిచారు సుమిత్రాదేవి. ముషీరాబాద్ లో ఇప్పటి వరకు 15 సార్లు ఎలక్షన్స్ జరగగా.. ఒకే ఒక్క మహిళ టి. అంజయ్య సతీమణి మణెమ్మ ప్రతానిధ్యం వహించారు. నాయిని నర్సింహారెడ్డి రాజీనామాతో 2008లో ఉప ఎన్నికరాగా అందులో మణెమ్మ గెలిచారు.
1952 శాలిబండ, 1957 పత్తర్‌ఘట్టి నియోజకవర్గాల్లో మసూమా బేగం కాంగ్రెస్ నుంచి పోటీచేసి గెలుపొందారు. 1999 ఎన్నికల్లో గెలిచిన సబితా ఇంద్రారెడ్డి భర్త పటోళ్ల ఇంద్రారెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో.. ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత వచ్చిన ఎలక్షన్స్ 2009, 2018లోనూ ఆమె పోటీ చేసి గెలిచారు. టీడీపీ తరుపున 1999లో ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసి గెలిచారు కొండ్రు పుష్పలీల. నటి జయసుధ కాంగ్రెస్ నుంచి 2009లో సింకింద్రాబాద్ నుంచి పోటీ చేసి గెలిచారు. 1967, 1972 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రాతినిధ్యం వహించిన జి.సరోజినీ పుల్లారెడ్డి మలక్ పేట్ నుంచి గెలిచారు. 1983లో సనత్ నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కాట్రగడ్డ ప్రసూన విజయం సాధించారు. 1972లో గగన్ మహల్ నుంచి టి. శాంతాబాయి, 1969, 1972లో వి. మంకమ్మ (వి.రామారావు భార్య) కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు.