Sonia Gandhi : మహిళా రిజర్వేషన్ బిల్లు రాజీవ్ గాంధీ కల..సోనియా గాంధీ
X
మహిళా రిజర్వేషన్ బిల్లును తాము సపోర్ట్ చేస్తున్నామని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రకటించారు. ఈ బిల్లును వెంటనే అమలు చేయాలని ఆమె కేంద్రాన్ని కోరారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో ఇవాళ చర్చ కొనసాగుతోంది. చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం లోక్‌సభలో నారీ శక్తి వందన్ అభియాన్ 2023 బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు తమ పూర్తి మద్దతు ఉంటుందని కాంగ్రెస్ తరఫున సోనియా గాంధీ ఇవాళ లోక్‌సభలో మహిళా బిల్లుపై జరిగిన చర్చలో తెలిపారు.
లోక్‌సభలో సోనియా గాంధీ ప్రసంగిస్తూ..."మహిళా రిజర్వేషన్ బిల్లు రాజీవ్ గాంధీ కల. ఈ బిల్లుకు మేం మద్దతిస్తాం. వంటిల్లు నుంచి ప్రపంచ వేదికల వరకు భారత మహిళల పాత్ర ఎంతో ఉంది. రాజ్యసభలో మొదట బిల్లు ప్రవేశపెట్టింది మేమే. నా భర్త రాజీవ్ ఆనాడే రాజ్యసభలో మహిళా బిల్లు తీసుకొచ్చారు. కానీ అప్పట్లో 7 ఓట్ల తేడాతో అది ఆగిపోయింది. అప్పటి మాజీ ప్రధాని పీవీ నరసింహరావు హయాంలోనూ కాంగ్రెస్ ఈ బిల్లును అమల్లోకి తీసుకువచ్చింది. దాని ఫలితంగానే ఇప్పటివరకు స్థానిక సంస్థల్లో 15 లక్షల మంది మహిళలు ప్రాతినిధ్యం వహించగలిగారు. ఈ బిల్లు కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాం.
మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంకెంతకాలం ఎదురుచూడాలి. ఆలస్యమైతే మహిళలకు అన్యాయం జరుగుతుంది. బిల్లు ఆమోదంతో రాజీవ్ గాంధీ కల నెరవేరింది"అని సోనియా తెలిపారు.