ఈటల రాజేందర్‌కు ‘వై’ కేటగిరి భద్రత
X
తెలంగాణ రాజకీయాల్లో హుజురాబాద్ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈటల రాజేందర్‌కు ప్రాణహాని ఉందని అతని భార్య ఈటల జమున ఆరోపించడం సంచలనం సృష్టించింది. ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఈటల హత్యకు రూ.20 కోట్లు సుపారీ ఇచ్చారంటూ ఆమె మీడియా ముందు ఆరోపణలు చేశారు. ఈ అంశంపై తెలంగాణ సర్కార్ దృష్టిసారించింది.
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈటల రాజేందర్ భద్రతపై ఆరా తీశారు. డీజీపీ అంజనీకుమార్‌కు ఫోన్ చేసి రాష్ట్రప్రభుత్వం తరఫున సెక్యూరిటీ ఇవ్వాలని సూచించారు. అదే విధంగా ఈటల భద్రతపై సీనియర్ ఐపీఎస్‌తో వెరిఫై చేయాలని ఆదేశించారు. డీజీపీ ఆదేశాల మేరకు ఈటల ఇంటిని డీసీపీ పరిశీలించారు. ఈటల ఇంటి పరిస్థితులను గమనించారు. భద్రతపై కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈటల రాజేందర్‌కు ‘వై’ కేటగిరి భద్రత కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఆరోపణలు చేసిన ఒక్క రోజు వ్యవధిలోనే.. బీజేపీ ఎమ్మెల్యే ఈటల సెక్యూరిటీపై ఏకంగా కేటీఆర్ రంగంలోకి దిగడం.. సెక్యూరిటీ ఇవ్వాలని ఆదేశించడం చర్చనీయాంశమైంది.
ఈటల ఆగ్రహం..
ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిపై ఈటల ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌశిక్ ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని మండిపడ్డారు. కౌశిక్ వ్యవహారంపై సీపీకి కూడా ఫిర్యాదు చేసినట్లు ఈటల తెలిపారు. వెంటనే కౌశిక్ రెడ్డిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తమ ఓపిక నశిస్తే సైకోకు చెప్పుల దండ వేసి తిప్పుతామని హెచ్చరించారు. నన్ను చంపేందుకు సుపారి ఇచ్చేంత వరకు కౌశిక్ రెడ్డి వచ్చిందని తెలిపారు.