కేసీఆర్ హెల్త్ బులిటెన్ విడుదల
X
మాజీ సీఎం కేసీఆర్ కోలుకుంటున్నారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయన నడవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయనకు శుక్రవారం జరిగిన తుంటి ఎముక మార్పిడి సర్జరీ విజయవంతమైంది. ఈ క్రమంలో వైద్యులు రెండో రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ‘‘కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది. వైద్య బృందం ఆయన్ని నిత్యం పర్యవేక్షిస్తోంది. బెడ్ మీద నుంచి లేచి నడవగలుగుతున్నారు. ఆర్థోపెడిక్, ఫిజియోథెరపీ వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్ నడుస్తున్నారు. ఆయన ఆరోగ్య పురోగతి పట్ల సంతృప్తిగా ఉన్నాం’’ అని యశోద ఆసుపత్రి డాక్టర్లు ప్రకటించారు.
మరోవైపు కేసీఆర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు, రాజకీయ నాయకులు కోరుకుంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పూజలు నిర్వహిస్తున్నారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, సమాజ్ వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలని వేగంగా కోలుకోవాలని ప్రార్థించారు.