Home > తెలంగాణ > యూట్యూబ్ నుంచి రూ. 60 లక్షలు.. అయినా బ్యాంక్ బ్యాలెన్స్ అంతేనట..

యూట్యూబ్ నుంచి రూ. 60 లక్షలు.. అయినా బ్యాంక్ బ్యాలెన్స్ అంతేనట..

యూట్యూబ్ నుంచి రూ. 60 లక్షలు.. అయినా బ్యాంక్ బ్యాలెన్స్ అంతేనట..
X

నా అన్వేషణ.. ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండింగ్ ఛానల్ ఇది. గత నెలలో యూట్యూబ్ నుంచి రూ. 30లక్షలు అందుకుని తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ యూట్యూబర్ అనిపించుకున్నాడు అన్వేష్. వరుసగా రెండో నెల కూడా రూ.30 లక్షల ఆదాయంతో ఇండియన్ ట్రావెలింగ్ కమ్యూనిటీలో నెంబర్ వన్ యూట్యూబర్గా నిలిచాడు.

వైజాక్ కు చెందిన అన్వేష్ ట్రావెలింగ్ అండ్ టూరిజంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. ట్రావెలింగ్ పై ఆసక్తితో ఇప్పటి వరకు 85 దేశాలు తిరిగాడు. అక్కడి వింతలు విశేషాలను తన వీడియోల ద్వారా యూట్యూబ్ ప్రేక్షకులకు చూపిస్తున్నాడు. అయితే రెండు నెలల క్రితం వరకు అంతంత మాత్రంగానే ఉన్న అన్వేష్ ఆదాయం ఇంత భారీగా పెరగడం అందరినీ ఆశ్చర్యపరిచింది. గత నెలలో కేవలం 10 వీడియోలు పెట్టినా రూ. 30 లక్షల ఆదాయం రావడానికి కారణాలను అన్వేష్ స్వయంగా వీడియోలో చెప్పాడు

చైనా సీరిస్ హిట్

అన్వేష్ ను అదృష్టం రాత్రికి రాత్రే తలుపు తట్టలేదు. నాలుగేళ్ల కష్టం తర్వాత లక్ష్మీ కటాక్షం కలిగింది. నిజానికి చైనా సీరిస్ అద్భుతంగా హిట్టైంది. అదికాస్తా అన్వేష్ కు కలిసొచ్చింది. నిజానికి చైనా గురించి, అక్కడ జరిగిన అభివృద్ధి గురించి బాహ్య ప్రపంచానికి తెలియదు. ఇటీవల అన్వేష్ చేసిన చైనా సీరిస్ లో అక్కడ జరిగిన అభివృద్ధిని భారత్ తో పోల్చి చూపాడు. అది కాస్త కాంట్రవర్సీగా మారడంతో అన్వేష్ తంతే బూరల బుట్టలో పడ్డట్లైంది. ఆ సీరిస్ లో ప్రతి వీడియోకు మిలియన్లలో వ్యూస్ వచ్చాయి. గత నెలలో 20 వీడియోలు అప్ లోడ్ చేయగా రూ.30 లక్షల ఇన్ కం వచ్చింది.

స్మార్ట్ కాదు హార్డ్ వర్క్

వీడియోల కోసం అన్వేష్ రోజులో దాదాపు 19 గంటల చొప్పున కష్టపడ్డాడు. తాను ఏనాడు స్మార్ట్ వర్క్ చేయలేదని హార్డ్ వర్క్ నే నమ్ముకున్నానని అంటున్నాడు. నాలుగేళ్లుగా కష్టపడుతున్నా వీడియోలకు సరైన్ వ్యూస్ రాలేదు. ఏడాది క్రితం వరకు ఆయన 750 వీడియోలు అప్ లోడ్ చేయగా అందులో ఒక్క దానికి కూడా మిలియన్ వ్యూస్ రాలేదు. అయినా నిరాశపడకుండా కష్టపడుతూ పోయాడు. కానీ చైనా సీరిస్ తర్వాత నా అన్వేషణ ఛానల్ లో 100 వీడియోల వ్యూస్ మిలియన్ దాటాయి. 20 వీడియోలు 2 మిలియన్లు, 2 వీడియోలు 3 మిలియన్ల వ్యూస్ క్రాస్ చేశాయి. దీంతో అన్వేష్ నెంబర్ వన్ యూట్యూబర్గా మారాడు.

కలిసొచ్చిన నెగిటివ్ ప్రచారం

చైనా సీరిస్ లోని 20 వీడియోలు హిట్ కావడంతో ఆడియెన్స్ పాత వీడియోలు చూడటం మొదలుపెట్టారు. దీంతో రోజులు 50లక్షల వ్యూస్ రావడం మొదలైంది. దీనికి తోడు చైనా వీడియోలపై వైసీపీ, టీడీపీ, జనసేన రాజకీయంగా చేసిన నెగిటివ్ ప్రచారం కూడా కలిసొచ్చిందని అన్వేష్ చెబుతున్నాడు. మొత్తమ్మీద ఒక్క రోజులో ఒక్కొక్కరు పదుల సంఖ్యలో పాత వీడియోలు చూస్తుండటంతో ఈ నెలలో కేవలం 10 వీడియోలే పెట్టినా రూ.30 లక్షల ఆదాయం వచ్చిందని అంటున్నాడు.

సాయం చేయను

నిజానికి ఇంత భారీ మొత్తంలో డబ్బు రావడంతో అన్వేష్ తొలుత అనాధాశ్రమాలు, పేదలకు సాయం చేద్దామనుకున్నాడు. రూ.30 లక్షల ఇన్ కం వీడియో పెట్టిన వెంటనే సాయం కావాలంటూ తనకు 500లకు పైగా ఈ మెయిల్స్ వచ్చాయట. అయితే ఆరాతీస్తే అందులో పదుల సంఖ్యలోనే నిజమైన వారు ఉన్నారని తేలడంతో ఫ్రెండ్ సలహా మేరకు సాయం మానుకోవాలని డిసైడయ్యాడట. అందుకు బదులు తనకు వచ్చే ఆదాయంపై అడ్వాన్స్ ట్యాక్స్ కట్టాలని నిర్ణయించుకున్నాడట. రెండు నెలల్లో రూ.60 లక్షలు వచ్చినా టాక్స్ చెల్లింపు, ఫ్యూచర్ ట్రావెలింగ్ బుకింగ్స్, ఇతర ఖర్చులుపోనూ తన వద్ద కేవలం రూ.2,10,000 మాత్రమే ఉన్నాయని ప్రూఫ్తో సహా చూపించాడు అన్వేష్. తాను ఎలాంటి ప్రమోషన్లు చేయనని, రాత్రి పగలనక కష్టపడితేనే డబ్బు వస్తోందని అలాంటప్పుడు తన కష్టార్జితాన్ని ఎవరికో ఎందుకు ఇవ్వాలని ప్రశ్నిస్తున్నాడు. ఇండియాలో హయ్యెట్ ట్యాక్స్ పేయర్ కావాలన్న తన చిన్ననాటి కల నిజం చేసుకునేందుకు కష్టపడతానని అంటున్నాడు.

Updated : 5 Aug 2023 5:17 PM GMT
Tags:    
Next Story
Share it
Top