Home > తెలంగాణ > హరీశ్ రావుపై షర్మిలక్క పైర్.. కాళేశ్వరంపై పోరాడుతున్నది నేనే..

హరీశ్ రావుపై షర్మిలక్క పైర్.. కాళేశ్వరంపై పోరాడుతున్నది నేనే..

హరీశ్ రావుపై షర్మిలక్క పైర్.. కాళేశ్వరంపై పోరాడుతున్నది నేనే..
X

కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. ఆయన అప్‌డేట్ కాలేని, ప్రాజెక్టు విలువే అంతలేని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. రూ. 80వేల కోట్ల ప్రాజెక్టులో రూ. లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని చెప్పడం పెద్ద జోక్ అని అన్నారు. ఈ గొడవలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా దూరారు. బీఆర్ఎస్ నేతలు ఏవో లెక్కల పేరుతో వితండవాదం చేస్తున్నారని, కాగ్‌నే తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. ‘బీఆర్ఎస్ బందిపోట్లు ప్రాజెక్ట్ అవినీతిపై కొత్త పాట పాడటం విడ్డూరంగా ఉంది. ప్రశ్నించేవారిపైనే అక్కసు వెళ్లగక్కుతున్నారు’ అని పెద్ద ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ అవినీతిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆమె డిమాండ్ చేశారు.

షర్మిల ఏమన్నారంటే..

‘‘రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, కాళేశ్వరం కమీషన్లతో దేశ రాజకీయాలు చేస్తున్న బీఆర్ఎస్ బందిపోట్లు ప్రాజెక్ట్ అవినీతిపై కొత్త పాట పాడటం విడ్డూరం. రూ.80 వేల కోట్లతో కట్టిన ప్రాజెక్ట్ లో లక్ష కోట్లు ఎలా తింటం అని చేస్తున్న వితండవాదం దెయ్యాలు వేదాలు వల్లించినట్లే ఉంది. రాష్ట్రాన్ని దోచుకుతిన్న దొంగలు కాగ్ రిపోర్టునే తప్పుదోవ పట్టిస్తున్నారు. రూ.62 వేల కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్ట్ ను అంచనా వ్యయం 1,51,168 కోట్లకు పెంచారని, నెలకు రూ.2,100 కోట్లు ఎలా కడతారని కాగ్ తూర్పారపడితే.. సమాధానం చెప్పే దమ్ము లేదు కానీ.. ప్రశ్నించే వారిపై అక్కసు వెళ్లగక్కడం మాత్రమే బీఆర్ఎస్ దొంగలకు తెలుసు. వైఎస్సార్ హయాంలో రూ.38 వేల కోట్లతో పూర్తి కావాల్సిన అంబేడ్కర్ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ ను రీడిజైన్ చేసి, రూ.1.51 లక్షల కోట్లకు అంచనా వ్యయం పెంచారు.రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి లక్ష ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వలేకపోయారు. నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా కట్టిన ప్రాజెక్టు మూడేండ్లకే మునిగిపోతే కనీసం విచారణ కూడా చేపట్టలేదు. మరి లక్ష కోట్లతో ఎవరి జేబులు నింపినట్టు? ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికి మేలు జరిగినట్టు?’’ అని ఆమె ప్రశ్నించారు.

‘‘కాళేశ్వరం ప్రాజెక్టుపై చేసిన ఖర్చుకు, దాని వల్ల జరుగుతున్న ప్రయోజనాలకు పొంతనే లేదు. కాళేశ్వరం వల్ల జరిగే ప్రయోజనాలను ఎక్కువగా చూపించారని చెబుతున్న కాగ్ మాటలు దొరకు వినిపించడం లేదా? ఇంత అవినీతి జరుగుతుందని తెలిసినా బీజేపీ ఎందుకు సీబీఐ విచారణకు ఆదేశించడం లేదు.. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరుగుతుందని కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, షెకావత్ సైతం ఆరోపణలు చేసింది నిజం కాదా? కేసీఆర్ బీజేపీకి బీ టీం కాకపోతే కేంద్ర పెద్దలు సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలి. కేసీఆర్ కమీషన్ల కోసం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అడుగడుగునా అవినీతి, తప్పుడు లెక్కలే... కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రాష్ట్రంలో కేసీఆర్ చేసిన రూ.లక్ష కోట్ల "మెగా" కుంభకోణంపై పోరాటం చేస్తున్నది కేవలం వైఎస్సార్ తెలంగాణ పార్టీ మాత్రమే. కాళేశ్వరంలో కేసీఆర్ అవినీతిపై ఢిల్లీ వరకు పోరాడి సీబీఐ, కాగ్ లకు ఫిర్యాదు చేశాం’’ అని ఆమె తెలిపారు.

Updated : 3 July 2023 10:00 PM IST
Tags:    
Next Story
Share it
Top