కేటీఆర్.. మీ సీటును మహిళకు ఇవ్వండి.. షర్మిల డిమాండ్
X
మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లకు అనుకూలమని చెబుతున్న బీఆర్ఎస్ పార్టీ వెంటనే ఆ విధానాన్ని మాటల్లో కాకుండా చేతల్లో అమలు చేసి చూపాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు డిమాండ్ చేశారు. మహిళలను ఘోరంగా అవమానించిన బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పుడు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహిళల కోటా కింద తన సిరిసిల్ల సీటు పోయినా బాధపడనన్న మంత్రి కేటీఆర్‌కు ఆమె సవాల్ విసిరారు.
‘‘బిల్లు అమలయ్యేదాక ఎదురు చూడటం ఎందుకు? ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనే మీ సీటు త్యాగం చేసి ఒక మహిళకు ఇవ్వాలి. ఆ త్యాగం చేస్తే మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటారు? సిరిసిల్లలో మహిళల ఓట్లే అధికం కాబట్టి దమ్ముంటే మీ సీటును ఇప్పుడే త్యాగం చేయాలి. గజ్వేల్, సిద్దిపేట సీట్లను కూడా మహిళలకే కేటాయించాలి. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో 63 చోట్ల మహిళా ఓటర్లే ఎక్కువ కాబట్టి ఇప్పుడు ఇచ్చిన 7 సీట్లకు మరో 32 కలిపి ఇవ్వాలి. కేటీఆర్ ఈ సవాలు స్వీకరించాలి’’ అని డిమాండ్ చేశారు.
బిల్లు బీఆర్ఎస్ పోరాడి సాధించిందే అయితే ఈ ఎన్నికల్లోనే మహిళలకు 33 శాతం టికెట్ల ఇవ్వాలని అన్నారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించిన రాష్ట్రంగా తెలంగాణను నిలపాలని కోరారు. తెలంగాణ ఉద్యమం కోసం బలిదానం చేసిన శ్రీకాంతాచారి తల్లి ఓడిపోతే ఆమెకు ఏ పదవీ ఇవ్వలేదు గాని మీ చెల్లెలిని ఎమ్మెల్సీని చేశారని విమర్శించారు. ‘‘మీకున్నది మహిళల మీద ప్రేమ కాదు, మీ కుటుంబం మీద తప్ప ప్రజలపై మీకు ప్రేమ లేదు’’ అని షర్మిల ధ్వజమెత్తారు.