కాంగ్రెస్లో వైఎస్సాఆర్టీపీ విలీనం..? జులై 8న అధికారిక ప్రకటన..?
X
కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనానికి లైన్ క్లియర్ అయిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ మధ్యవర్తిత్వం ఫలించినట్లు సమాచారం. పార్టీ విలీనానికి సంబంధించి వచ్చే నెల అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు లోటస్ పాండ్ వర్గాలు చెబుతున్నాయి. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్న వైఎస్ ఆంకాంక్ష నెరవేర్చేందుకు ఆయన కుమార్తె షర్మిల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
రంగంలోకి కేసీ వేణుగోపాల్
నిజానికి కాంగ్రెస్లో వైఎస్సాఆర్టీపీ విలీనానికి సంబంధించి చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నయి. ఈ క్రమంలోనే కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ డీకే శివకుమార్తో షర్మిల 15 రోజుల వ్యవధిలో రెండుసార్లు భేటీ అయ్యారు. దీంతో పార్టీ విలీనం పక్కా అని వార్తలు వచ్చినా షర్మిల వాటిని ఖండించారు. పైకి అలాంటిదేం లేదని చెప్పినా తెరవెనుక మంతనాలు మాత్రం కొనసాగినట్లు తెలుస్తోంది. ఏపీలో వైసీపీ, టీడీపీకి చెక్ పెట్టేందుకు షర్మిల సేవలు ఉపయోగించుకోవాలని నిర్ణయానికొచ్చిన కాంగ్రెస్ ఇందుకోసం పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ను రంగంలోకి దింపినట్లు సమాచారం.
ఇడుపులపాయకు సోనియా, రాహుల్?
పార్టీ విలీనానికి సంబంధించి కేసీ వేణుగోపాల్, షర్మిల భర్త అనిల్ కుమార్తో ఫోన్లో చర్చించినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. షర్మిల, విజయమ్మలు కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీతో త్వరలో సమావేశంకానున్నారన్నది ఆ ఫోన్ కాల్ సారాంశం. ఈ క్రమంలోనే వైఎస్ జన్మదినమైన జులై 8న సోనియా, రాహుల్ గాంధీ ఇడుపులపాయకు వచ్చి ఆయనకు నివాళులర్పించున్నట్లు వార్తలు వస్తున్నాయి. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలనుకున్న తండ్రి వైఎస్ కోరిక నెరవేర్చేందుకే ఆయన బిడ్డ షర్మిల కాంగ్రెస్ వైపు అడుగులు వేస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. తాజాగా సోమవారం రాహుల్ గాంధీకి షర్మిల బర్త్ డే విషెస్ చెప్పడం కాంగ్రెస్తో షర్మిల పార్టీ విలీనం అంశం మరోసారి హాట్ టాపిక్గా మారింది.
పార్టీ విలీనానికి మొగ్గు..!
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడుగడుగునా అడ్డుకున్న వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై తెలంగాణ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయన బిడ్డ అయిన షర్మిలను ఇక్కడి జనం ఆదరించే అవకాశం ఏ మాత్రం లేదు. మరోవైపు టీ కాంగ్రెస్లో ఇప్పటికే వర్గపోరు నడుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో షర్మిలతో కలిసి నడిస్తే అది పార్టీకి మరింత నష్టం చేకూర్చే అవకాశముంది. ఈ పరిణామాలన్నింటినీ సమగ్రంగా పరిశీలించిన కాంగ్రెస్ హైకమాండ్.. షర్మిల సేవలు ఏపీలో మాత్రమే వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అన్నా చెల్లెళ్ల సవాల్
2012 - 2013 మధ్య కాలంలో అన్న జైలులో ఉన్నప్పుడు జగన్ వదిలిన బాణంగా షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేశారు. కాలికి గాయమైనా లెక్కచేయకుండా 3,112 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. కానీ వైఎస్ జగన్ అధికారం చేపట్టాక పరిస్థితులు మారిపోయాయి. అన్నతో విబేధాల కారణంగా షర్మిల వైసీపీకి దూరమయ్యారు. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే ఆమె తిరిగి వైసీపీ గూటికి చేరే అవకాశాలు ఏ కోశానా కనిపించడం లేదు. మరోవైపు వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వాన్ని జగన్ ఒక్కడే గంపగుత్తగా వాడుకుంటున్నాడు. ఈ క్రమంలో ఏపీలో షర్మిలను రంగంలోకి దింపి దానికి చెక్ పెట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మ్యానరిజం, చేతివాటం, మాట తీరు, నాయకత్వ లక్షణాలు షర్మిలకు ఉండడం పార్టీకి కలిసొస్తుందని ప్రజలు ఆమెను ఆదరిస్తారని ధీమా వ్యక్తం చేస్తోంది.
షర్మిలకు బంపరాఫర్
ఇటీవలే కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ షర్మిలకు ఫోన్ చేసి తమ పార్టీతో కలిసి నడవాలని ఆహ్వానించారని అందుకు ఆమె ఓకే చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ షర్మిలకు ఆయన బంపరాఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. షర్మిల పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన అనంతరం ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని అప్పగించాలని, పనిలో పనిగా కర్నాటక నుంచి రాజ్యసభకు కూడా పంపుతామని హామీ ఇచ్చినట్లు సమాచారం. తెలంగాణలో రాజకీయ భవిష్యత్తు ఏ మాత్రం లేదని డిసైడ్ అయిన షర్మిల కాంగ్రెస్ హైకమాండ్ ఇచ్చిన బంపరాఫర్ కు దాదాపు ఓకే చెప్పినట్లు ఆమె సన్నిహితులు చెపుతున్నారు. పార్టీ విలీనానికి సంబంధించి జులై 8న అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని అంటున్నారు.