YS Bhaskar Reddy : వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ వాయిదా
X
వైఎస్ భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. శుక్రవారం ఆయన పిటిషన్ను పరిశీలించిన నాంపల్లి సీబీఐ కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐను ఆదేశించింది. కేసు విచారణను జూన్ 5కు వాయిదా వేసింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టయిన వైఎస్ భాస్కర్‌రెడ్డి బెయిల్ కోసం గురువారం సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్నందున బెయిల్ ఇవ్వాలని కోరారు. దాదాపు నెలన్నర రోజులుగా జైలులో ఉంటున్నానని, కస్టడీ విచారణ కూడా ముగిసిందని భాస్కర్‌రెడ్డి పిటిషన్ లో ప్రస్తావించారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని బెయిల్ ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరారు.
వివేకా హత్య కేసులో అరెస్టైన భాస్కర్ రెడ్డి ఏప్రిల్ 16 నుంచి హైదరాబాద్‌లోని చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. భాస్కర్ రెడ్డి అరెస్టు సందర్భంగా సీబీఐ అధికారులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు ప్రస్తావించారు. కేసులో కీలక సాక్షులను అనుచరుల ద్వారా ప్రభావితం చేస్తున్నారని, దర్యాప్తును తప్పుదోవ పట్టించేందుకు భాస్కర్‌రెడ్డి ప్రయత్నించారని సీబీఐ అధికారులు ఆరోపిచారు. ఆయన విచారణకు సహకరించడం లేదని, భాస్కర్ రెడ్డి పత్తా లేకుండా పోయే అవకాశముందని రిమాండ్ రిపోర్ట్లో రాశారు. అనంతరం సీబీఐ ఏప్రిల్ 19 నుంచి 24 వరకు ఆయనను కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించింది.
ఇదిలా ఉంటే చంచల్ గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న వైఎస్ భాస్కర్ రెడ్డి మే 24న తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో జైలు అధికారులు ఆయనను వెంటనే ఉస్మానియా హాస్పిటల్‌కి తరలించారు. ఆయనను పరీక్షించిన డాక్టర్లు బీపీ పెరగడంతో అస్వస్థతకు గురయ్యారని, మెరుగైన చికిత్స కోసం నిమ్స్ కు తీసుకెళ్లాలని సూచించారు. దీంతో జైలు అధికారులు గత శనివారం ఆయనను వైద్యం కోసం నిమ్స్కు తరలించారు. అనంతరం మళ్లీ జైలుకు తరలించారు.