Home > తెలంగాణ > కవితమ్మా.. మీ నాన్నకు చెప్పి ఇప్పించు.. షర్మిల సటైర్లు

కవితమ్మా.. మీ నాన్నకు చెప్పి ఇప్పించు.. షర్మిల సటైర్లు

కవితమ్మా.. మీ నాన్నకు చెప్పి ఇప్పించు.. షర్మిల సటైర్లు
X

బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థులను సీఎం కేసీఆర్ సోమవారం ప్రకటించారు. మొత్తం 115 మంది పేర్లను వెల్లడించారు. కేసీఆర్ ప్రకటించిన జాబితాలో కేవలం ఏడుగురు మహిళలకు అవకాశం దక్కింది. 2018లో నలుగురు మహిళా అభ్యర్థులకు టికెట్లు ఇవ్వగా వారిలో ముగ్గురు విజయం సాధించారు. ఈసారి అదనంగా ముగ్గురు మహిళలకు జాబితాలో స్థానం కల్పించారు. మహిళలకు తక్కువ సీట్లు కేటాయించారని బీఆర్ఎస్ పై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శలు చేశారు. కవిత పేరును ప్రస్తావిస్తూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఢిల్లీలో మహిళల రిజర్వేషన్ల కోసం పోరాటం కవిత..సొంత పార్టీలో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.

"33 శాతం రిజర్వేషన్లకు చిత్తశుద్ధితో పార్టీలు కలిసి రావాలని చిలక పలుకులు పలుకుతున్న కవితమ్మ.. ఎక్కడ పాయె మీ చిత్తశుద్ధి? 115 సీట్లలో 7 స్థానాలు ఇచ్చిన మీకు చిత్తశుద్ది ఉన్నట్లా? ఆకాశం,అధికారం సగం సగం అని శ్రీరంగ నీతులు చెప్పిన మీరే 6 శాతం ఇస్తే చిత్తశుద్ధి చూపినట్లా? కవితమ్మ "Be the change you want to see ". ఢిల్లీలో దొంగ దీక్షలు కాదు.. రాష్ట్రంలో సీట్లిచ్చే దమ్ముండాలి.తెలంగాణ జనాభాలో 50 శాతం మహిళలున్నా క్యాబినెట్ లోనూ ప్రాధాన్యత దక్కలే. లిక్కర్ బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్ ల గురించి కాకుండా మీ నాన్నతో మాట్లాడి క్యాబినెట్ లో, పెద్దల సభలో, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు రిజర్వేషన్ ఇప్పించు. లిక్కర్ స్కాం పక్కదారి పట్టించేందుకు ఎత్తుకున్న నినాదమే 33 శాతం రిజర్వేషన్లు తప్ప.. మీకెక్కడిది మహిళల పట్ల చిత్తశుద్ధి. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడుల పైన స్పందించిన పాపాన పోలేదు.. రాజధాని నడిబొడ్డున ఆడపడుచులపై అత్యాచారాలు జరుగుతున్నా, మీ పోలీసులు మహిళా రైతులకు బేడీలు వేసినా, స్టేషన్ లో పెట్టి థర్డ్ డిగ్రీ ప్రయోగించినా మీకు పట్టదు.. మీ దృష్టిలో మహిళలు వ్రతాలు చేసుకోవడానికి, ఓటు బ్యాంకుగా మాత్రమే పనికొస్తారు కానీ రాజకీయాలకు కాదు.. . నిజంగా మీకు మహిళా రిజర్వేషన్లపై గౌరవం ఉంటే.. సార్వత్రిక ఎన్నికల్లో 33 శాతం అమలు చేయించాలి. సిట్టింగులకు ఇచ్చిన సీట్లలో 33 స్థానాలు మహిళా అభ్యర్థులకు అవకాశం ఇప్పించి కవితమ్మ చిత్తశుద్ధి నిరూపించుకోవాలి" అని షర్మిల ట్వీట్ చేశారు.

Updated : 22 Aug 2023 2:21 PM GMT
Tags:    
Next Story
Share it
Top