Telangana Assembly Elections: తెలంగాణ ఎన్నికల బరిలో వైఎస్ షర్మిల..
X
అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ 115 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించగా.. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో తలమునకలయ్యాయి. కాంగ్రెస్లో వైఎస్సార్టీపీ విలీనం అంటూ గత కొన్నిరోజులుగా జోరుగా చర్చ నడుస్తోంది. షర్మిల సైతం ఢిల్లీ వెళ్లి అధిష్ఠానంతో చర్చలు జరిపారు. ఆ తర్వాత నుంచి ఈ పొత్తు అంశం అటకెక్కింది. కాంగ్రెస్ ఎటూ తేల్చకపోవడంతో వైఎస్ షర్మిల కీలక నిర్ణయం తీసుకున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో వైఎస్సార్టీపీ బరిలో ఉంటుందని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 119 స్థానాల్లో పోటీ చేస్తామని.. ఆశావాహులు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. తాను పాలేరుతో పాటు మరోస్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. విజయమ్మ, అనిల్ పోటీచేయాలనే డిమాండ్లు ఉన్నాయని.. అవసరమైతే విజయమ్మ పోటీ చేస్తారని తెలిపారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని త్యాగానికి కూడా సిద్ధపడ్డానని అన్నారు.