Home > తెలంగాణ > మహిళలకు ఉచిత ప్రయాణం.. నేటి నుంచి గుర్తింపు కార్డు తేవాల్సిందే

మహిళలకు ఉచిత ప్రయాణం.. నేటి నుంచి గుర్తింపు కార్డు తేవాల్సిందే

మహిళలకు ఉచిత ప్రయాణం.. నేటి నుంచి గుర్తింపు కార్డు తేవాల్సిందే
X

‘మహాలక్ష్మి’ పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయాలనుకునే మహిళలు నేటి నుంచి గుర్తింపు కార్డులు చూపించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ఎక్స్‌ప్రెస్‌, ఆర్డీనరీ బస్సుల్లో బాలికలు, యువతులు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లు ఉచిత ప్రయాణం చేసినప్పటికీ ఎలాంటి గుర్తింపు కార్డులను కండక్టర్లు అడగలేదు. టికెట్‌లు కూడా ఇవ్వలేదు. రోజూ ఎంతమంది ఉచిత ప్రయాణం చేశారనే వివరాలను కండక్లర్లు ఎస్‌ఆర్‌లో నమోదు చేశారే తప్ప టికెట్ల రూపంలో కచ్చితమైన గణాంకాలు లేకుండా పోయాయి. ఇక శుక్రవారం నుంచి బస్సుల్లో ఉచిత ప్రయాణం చేయాలంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన వారుగా ధ్రువీకరణను తెలిపే ఆధార్‌ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు లేదా రేషన్‌ కార్డును చూపించి జీరో టికెట్‌ తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం ఆదేశించింది.

ప్రభుత్వం సూచించిన గుర్తింపు కార్డులను ప్రతీ మహిళ తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలని, లేకుంటే ఉచిత ప్రయాణానికి అనుమతి ఉండదని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. ఈ ‘జీరో టికెట్ల’ విధానం గురువారం అర్ధరాత్రి 12 గంటలు దాటాక అమల్లోకి వచ్చింది. జీరో టికెట్ల కోసం.. టికెట్లు జారీ చేసే మిషన్‌లలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ఇన్‌స్టాల్‌ చేశారు. మొదట కొన్ని డిపోల్లో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని అమలు చేయగా.. అది విజయవంతం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని బస్సుల్లో అమల్లోకి తెచ్చారు. శుక్రవారం నుంచి జీరో టికెట్లు జారీ చేయాలని ఆర్టీసీ అధికారులను ఎండీ వీసీ సజ్జనార్‌ ఆదేశించారు. డిసెంబరు 9 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. జీరో టికెట్‌లో ఆర్డినరీ బస్సా, ఎక్స్‌ప్రెస్సా, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం తదితర వివరాలు ఉంటాయి.

ఆర్టీసీ బస్సుల్లో ప్రతీ రోజూ ఎంతమంది మహిళలు ఉచితంగా ప్రయాణించారు.. ఎంత ఆదాయం కోల్పోవాల్సి వచ్చిందనే లెక్కలన్నీ.. జీరో టికెట్ల ద్వారా పక్కాగా ఉంటాయని, ఈ నివేదికల ఆధారంగా ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లింపులు చేసే అవకాశం ఉంటుందని అధికారులు అంటున్నారు.

Updated : 15 Dec 2023 1:40 AM GMT
Tags:    
Next Story
Share it
Top