9 ఏండ్ల తెలంగాణం.... నీటివనరులతో పచ్చగా మారిన మాగాణం
X
నా తెలంగాణ.. కోటి రతనాల వీణ. దాశరథి కలం నుంచి జాలువారిన ఈ పద కవితా ఝరి తెలంగాణ తొలి, మలి ఉద్యమంలో వలస పాలకుల విముక్తికి నినదించింది. నీళ్లు, నిధులు, నియామకాల పునాదిగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం కోటి ఎకరాల మాగాణం దిశగా దూసుకెళ్తోంది. ఉమ్మడి పాలనలో పల్లేర్లు మొలిచిన బీడు భూములు ప్రస్తతం పచ్చని పంట పొలాలుగా మారాయి. అంతే కాదు.. దేశంలోనే అత్యధిక పంటలు సాగు చేసే రాష్ట్రంగా ప్రతీ ఏటా తెలంగాణ తన రికార్డును తానే తిరిగరాసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం సాగునీటిపారుదల రంగానికి అగ్రస్థానం ఇవ్వటంతో తొమ్మిదేళ్ల వ్యవధిలో వ్యవసాయం, అనుబంధ రంగాల వృద్ధి ఉచ్ఛస్థితికి చేరుకుంది. తెలంగాణ కోటి ఎకరాల మాగాణంగా సస్యశ్యామలం కావాలన్న సీఎం కేసీఆర్ చిరకాల వాంఛ నెరవేరేదిశగా సాగునీటిరంగం మైలురాయిని దాటింది.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నిర్మాణం రాష్ట్ర సాగునీటిరంగంలో సరికొత్త అధ్యాయంగా నిలుస్తోంది. తెలంగాణ కోటి ఎకరాల మాగాణంగా మారుతోంది. వ్యవసాయానికి, తాగునీటి అవసరాలకు, ప్రజల జీవన ప్రమాణాలను పెంచేందుకు అత్యంత ప్రధానమైనది నీటి పారుదల రంగం. ఒక ప్రాంతం ప్రగతిలో ప్రధానపాత్ర పోషించాలంటే అందులో ప్రధానమైనవి నీటిపారుదల ప్రాజెక్టులు, వాటి పరీవాహక ప్రాంతాలు. ఈ విషయంలో కేసీఆర్ సర్కార్ ఏ మాత్రం రాజీపడకుండా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు కోట్ల నిధులు ఖర్చు పెట్టింది. కేంద్రం నుంచి నిధులు రాకున్నా సొంతంగా రాష్ట్ర బడ్జెట్ నుంచే ప్రాజెక్టులకు, రిజర్వాయర్లకు ఖర్చు చేయడం విశేషం.
వ్యవసాయరంగానికి సాగునీటి ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకున్న సీఎం కేసీఆర్… ప్రాజెక్టుల రీ డిజైనింగ్, రీ ఇంజనీరింగ్ వంటి వినూత్న ప్రణాళికలతో విజయవంతంగా ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కృషి ఫలితంగా సాగునీటిప్రాజెక్టుల రూపురేఖలు మారిపోయాయి. ఓవైపు కొత్త ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు మరోవైపు పాత ప్రాజెక్టులను విప్లవాత్మకరీతిలో ఆధునీకరించడంతో సాగునీటి ఆయకట్టు పెరిగింది.
నీటి పారుదల ప్రాజెక్టులు
ఈ దేశంలోని రెండు ముఖ్యమైన నదులైన గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రం విస్తరించి ఉంది. రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రాజెక్టులన్నీ ఈ నదులపైనే నిర్మించారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత గోదావరి నదిపై నిర్మించిన ప్రాజెక్ట్ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు (కేఎల్‌ఐపీ). ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌజ్ ప్రాజెక్టు మొత్తం ఏడు లింకులు, 28 ప్యాకేజీలుగా 13 జిల్లాల ద్వారా సుమారు 500 కి.మీ. విస్తరించి 1800 కి.మీ. కంటే ఎక్కువ కాలువలను ఉపయోగించుకుంటుంది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 240 టీఎంసీలు.
కాళేశ్వరమే కాక రాష్ట్రంలో మరికొన్ని భారీ ప్రాజెక్టులకు సైతం ఈ తొమ్మిదేళ్ల పాలనలోనే అంకురార్పణ జరగడం విశేషం. ప్రాణహిత ప్రాజెక్టు, ఇందిరమ్మ వరద ప్రవాహ కాలువ, లోయర్ పెనుగంగ ప్రాజెక్టు, శ్రీపాద ఎల్లంపల్లి ఎత్తిపోతల పథకం, శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ స్టేజ్-2, పీవీ నరసింహారావు కంతనపల్లి సుజల స్రవంతి ప్రాజెక్టు.. ఇవన్నీ ప్రస్తుతం కొనసాగుతున్న భారీ సాగునీటి ప్రాజెక్టులు.
గత ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాల కాలంలో దారుణమైన నిర్లక్ష్యానికి లోనైన తెలంగాణ ప్రాజెక్టులు.. నాగార్జునసాగర్, నిజాంసాగర్, ఘన్ పూర్ ఆనకట్ట కాలువల ఆధునీకీకరణ పనులని ఈ 9 ఏండ్లలోనే పూర్తి చేసి మొత్తం ఆయకట్టుకు నీరందించడం జరిగింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలువల ఆధునీకీకరణ కోసం ప్రభుత్వం 1000 కోట్లను నిధులను మంజూరు చేసింది. శ్రీరాం సాగర్ రెండో దశ కాలువల లైనింగ్ పనుల కోసం నిధులు మంజూరు చేసింది.
మిషన్ కాకతీయ
స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టిన వెంటనే తొలిప్రాధాన్యతగా చెరువుల పునరుద్ధరణపై దృష్టి సారించారు. 2015 మార్చి 12న నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సదాశివనగర్ పాత చెరువు వద్ద సీఎం కేసీఆర్ స్వయంగా మిషన్ కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్ని చెరువులున్నాయి? వాటికింద ఎన్ని లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని లెక్క తేల్చి.. అందుకు అనుగుణంగా ప్రతి ఏటా 20 శాతం పునరుద్ధరించాలని లక్ష్యంగా నిర్దేశించుకొన్నారు. మొత్తం 46,531 చెరువులుండగా.. ఇప్పటివరకూ నాలుగు దశల్లో రూ.9,155 కోట్లతో 27,627 చెరువులను పునరుద్ధరించారు. ప్రస్తుతం 5వ దశలో భాగంగా మిగిలిన చెరువుల పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. 9 ఏండ్ల కాలంలోనే అద్భుత ఫలితాలను అందిస్తున్నది ఈ పథకం. ఆయా చెరువుల్లో నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరగడంతో గ్రామాల్లో భూగర్భజలాల మట్టం పైపైకి వచ్చింది. మత్స్య పరిశ్రమ గణనీయ వృద్ధిని సాధించింది.. స్వరాష్ట్రంలో కాకతీయుల స్ఫూర్తితో సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టిన ఈ పథకాలతో రాష్ట్రంలో భూగర్భ జలాలు పెరిగాయి. ప్రతి పల్లె కనుచూపు మేర పరుచుకొన్న పచ్చదనంతో కొత్త అందాలను సంతరించుకొన్నది.
ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానం
చెరువులకు శాశ్వత జలకళను తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వ మరో బృహత్తర ప్రణాళిక భారీ ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానం. మొత్తంగా ప్రాజెక్టుల కమాండ్ ఏరియాలోని 20 వేలకుపైగా చెరువులను ప్రాజెక్టులతో లింక్ చేయాలని లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటికే అందులో 10 వేలకు పైగా చెరువులను ప్రాజెక్టులకు లింక్‌చేసి, నదీ జలాలతో నింపుతున్నారు. ఇందులో కాళేశ్వరం ప్రాజెక్ట్ కీలకభూమిక పోషిస్తున్నది. మూడేండ్ల క్రితం అందుబాటులోకి వచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా భారీ జలాశయాలను నిర్మించడంతోపాటు ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, నిజాంసాగర్, సింగూరు, ఎగువ మానేరు, దిగువ మానేరు, కడెం, వరదకాలువ తదితర ప్రాజెక్టులను లింక్ చేశారు. తద్వారా ఆయా ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. అలాగే, వాటి కింద ఉన్న చెరువులు నిండుకుండల్లా మారిపోయాయి. ఇప్పటికే 46 వేలకు పైగా చెరువుల్లో దాదాపు 20 వేలకుపైగా అనుసంధానించి.. నిరంతరం నీరుండేలా చూస్తున్నారు.
రైతుబంధు, రైతుబీమా
రాష్ట్రంలోని రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు రైతుబంధు, రైతుబీమా. ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.10000 (సీజన్‌కు రూ .5000 చొప్పున) ఇస్తున్నది. 2018, మే 10న కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్ నియోజకవర్గంలోని శాలపల్లిలో ఈ పథకాన్ని ప్రారంభించారు. మొదట్లో ఎకరానికి రూ.8 వేలు ఇవ్వగా ఆ తర్వాత మరో రూ.2 వేలు పెంచారు. ఇక అదే ఏడాది ఆగస్టు 15న ప్రారంభమైన రైతుబీమా పథకం.. సైతం రైతు కుటుంబాలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నది. ఈ పథకం ద్వారా మృతి చెందిన రైతు కుటుంబానికి ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారం అందిస్తున్నది. దళారీలు, ఇతరుల ప్రమేయం లేకుండా వారం, పది రోజుల్లోనే అందుతున్న ఆర్థిక సాయం రైతు కుటుంబాల్లో కష్టాలను తీరుస్తున్నది. ఇప్పటికే ఈ పథకం సత్ఫలితాలు ఉమ్మడి జిల్లాలోని 16,601 రైతు కుటుంబాలకు అందాయి. మొత్తం రూ.830.35 కోట్లు పరిహారంగా అందడంతో వారి కుటుంబాలకు ఈ పథకం ఆపన్నహస్తంలా నిలిచింది.