TS Assembly Elections 2023 : అందరి చూపు ఆ రెండు స్థానాలపైనే.. కేసీఆర్కు షాక్ తప్పదా..?
X
తెలంగాణలో మరికొన్ని గంటల్లో ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం కానుంది. 2290 మంది భవితవ్యం రేపు మధ్యాహ్నానికల్లా తేలనుంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ను మించిన ఫలితాలు వస్తాయని బీఆర్ఎస్ చెబుతోంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ 70సీట్లలో గెలుస్తామని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అటు కాంగ్రెస్ సైతం అధికారంలోకి వచ్చేది తామేనంటూ గట్టి నమ్మకంతో ఉంది. ఈ క్రమంలో తమ పార్టీ ఎమ్మెల్యేలు చేజారకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. దీంతో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది.
ఈ ఎన్నికలకు ఒక స్పెషాలిటీ ఉంది. ఈ సారి ముగ్గురు బడా నేతలు రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారు. సీఎం కేసీఆర్ గజ్వేల్తో పాటు కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన రెండు చోట్ల నుంచి పోటీ చేయడంపై విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఓటమి భయంతోనే రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారని ఆరోపించాయి. ఈ క్రమంలో ఆయనకు చెక్ పెట్టేందుకు బీజేపీ, కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేశాయి. సీఎం కేసీఆర్ పై కీలక నేతలను రంగంలోకి దింపాయి. ఈటల రాజేందర్ను బీజేపీ గజ్వేల్ బరిలో దింపగా.. కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని కామారెడ్డి బరిలో నిలిపింది. దీంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
ప్రస్తుతం రాష్ట్రం మొత్తం చూపు కామారెడ్డి, గజ్వేల్పైనే ఉంది. కేసీఆర్కు బిగ్ షాక్ తగలనుందా.. లేక ప్రతిపక్షాలకు కేసీఆర్ షాకిస్తారా అన్నది సస్పెన్స్గా మారింది. కామారెడ్డిలో రేవంత్‌రెడ్డి, గజ్వేల్‌లో ఈటల రాజేందర్ కేసీఆర్‌కు గట్టి సవాల్ విసురుతున్నారు. గజ్వేల్ కేసీఆర్ వైపే మొగ్గుచూపుతున్నా.. కామారెడ్డిలో మాత్రం ఆయనకు ఓటమి తప్పదని సర్వేలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే బీఆర్ఎస్కు ఇది పెద్ద ఎదురుదెబ్బ. సీఎం ఓడిపోవడం ఆ పార్టీకి మైనస్గా మారుతుంది.
ఒకవేళ ముగ్గురు నేతల్లో ఎవరైన రెండు చోట్ల గెలిస్తే మరో స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో తెలంగాణలో ఉపఎన్నిక రావడం ఖాయం. అలా కాకుండా పలు సంస్థల సర్వేల ప్రకారం కామారెడ్డిలో బీజేపీ, గజ్వేల్లో కేసీఆర్ గెలిస్తే ఉపఎన్నిక ఉండదు. మరి ఈ రెండు నియోజకవర్గాల ప్రజలు ఏ తీర్పు ఇచ్చారో మరికొన్ని గంటల్లో తేలనుంది.